మంత్రి మేకపాటి మృతిపై రూమర్లు.. స్పందించిన కుటుంబం
నిన్న రాత్రి జరిగిన ఒక ఫంక్షన్ లో అందరితో ఆయన సంతోషంగా గడిపారని కుటుంబ సభ్యులు తెలిపారు. రాత్రి 9.45 గంటలకు గౌతమ్ రెడ్డి
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన మృతిపై సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన వ్యాయామం చేస్తూ.. ఇబ్బంది పడ్డారని అసత్యాలు ప్రచారమవుతున్నాయి. ఆ రూమర్లపై మంత్రి మేకపాటి కుటుంబ సభ్యులు స్పందించారు. సోషల్ మీడియాలో గౌతమ్ రెడ్డి మృతిపై జరుగుతున్న ప్రచారం అసత్యమని స్పష్టం చేశారు. ఆయన వ్యాయామం చేస్తూ అస్వస్థతకు గురయ్యారని వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు.
నిన్న రాత్రి జరిగిన ఒక ఫంక్షన్ లో అందరితో ఆయన సంతోషంగా గడిపారని కుటుంబ సభ్యులు తెలిపారు. రాత్రి 9.45 గంటలకు గౌతమ్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. రోజూ మాదిరిగానే ఉదయం 6 గంటలకే లేచిన మంత్రి.. 6.30 వరకూ ఫోన్ తో కాలక్షేపం చేశారన్నారు. ఉదయం 7 గంటలకు ఇంట్లోని రెండో అంతస్తులో ఉన్న సోఫాలో కూర్చుని.. డ్రైవర్ నాగేశ్వరరావు పిలవమని వంటమనిషికి చెప్పారు. డ్రైవర్ వచ్చేసరికే.. 7.15 గంటలకు గౌతమ్ రెడ్డి గుండెపోటుకు గురై.. కిందపడ్డారు. అదిగమనించిన ఆయన సతీమణి శ్రీకీర్తి.. గట్టిగా అరవడంతో.. డ్రైవర్ నాగేశ్వరరావు పరుగున వచ్చి ఆయన ఛాతిపై చేతితో నొక్కడంతో.. స్వల్ప ఉపశమనం పొందారు.
ఆ తర్వాత 7.20 గంటలకు మంత్రి మంచినీరు కావాలని అడగ్గా.. తెచ్చి ఇచ్చారు. మంచినీరు కూడా తాగలేని పరిస్థితి చూసిన భార్య శ్రీకీర్తి.. వెంటనే సిబ్బందిని పిలిచారు. 7.22 గంటలకు "గుండెలో నొప్పి ఎక్కువవుతుంది కీర్తి" అని చెప్పడంతో.. హుటాహుటిన ఆస్పత్రికి బయల్దేరారు. వారి ఇంటికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అపోలో ఆస్పత్రికి 5 నిమిషాల్లో తీసుకెళ్లగా.. వైద్యులు ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స మొదలు పెట్టారు. 8.15 గంటల వరకూ పల్స్ బాగానే ఉందని, ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు. చాలా సేపు ప్రయత్నం తర్వాత 9.13గంటలకు మేకపాటి కన్నుమూశారని అపోలో వైద్యులు నిర్థారించారు. 9.15 గంటలకు ఆయన మరణ వార్తను అధికారికంగా ప్రకటించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.