వారిని సైడ్ చేసేందుకు రెడీ అయిపోయారా?
టీడీపీలో సీనియర్ నేతలకు ఇబ్బందులు తప్పేలా లేవు. వచ్చే ఎన్నికల్లో వీరిని దూరం పెట్టాలని చంద్రబాబు గట్టిగా నిర్ణయించారు
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలకు ఇబ్బందులు తప్పేలా లేవు. వచ్చే ఎన్నికల్లో వీరిని దూరం పెట్టాలని చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీ అధికారంలోకి వస్తే పదవుల విషయం ఆలోచించవచ్చని, ప్రత్యక్ష ఎన్నికలకు మాత్రం సీనియర్ నేతలను దూరంగా ఉంచాలని చంద్రబాబు డిసైడ్ చేశారు. ఇక ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా సీనియర్ నేతలను ఉంచి వారిని పార్టీ ప్రచారానికి వాడుకోవాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది.
ఇప్పటికే కొందరు....
ఇప్పటికే కొందరు సీనియర్ నేతలు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. జేసీ దివాకర్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి గత ఎన్నికలకు ముందే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. ఇక యనమల రామకృష్ణుడు వంటి సీనియర్లు ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై దశాబ్దం దాటింది. ఆయన పెద్దల సభకే పరిమితమయ్యారు. వీరితో పాటు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు అశోక్ గజపతిరాజు, కళా వెంకట్రావు, కొనకళ్ల నారాయణ, వర్ల రామయ్య, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వంటి వారిని ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంచాలని నిర్ణయించారని చెబుతున్నారు.
ప్రచార బాధ్యతలు...
వీరికి పార్టీలో కీలక పదవులు కట్టబెట్టి సామాజికవర్గాల ఆధారంగా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పజెబుతారంటున్నారు. ప్రస్తుతం అంతా యువకులే ఎన్నికల బరిలో ఉంటుండటంతో వీరికి టిక్కెట్ ఇచ్చి మరోసారి ప్రయోగం చేయకూడదని చంద్రబాబు నిర్ణయించారంటున్నారు. వీరితో పాటు కొందరు యాక్టివ్ గా లేని నేతల పేర్ల జాబితాను కూడా చంద్రబాబు సిద్ధం చేసినట్లు తెలిసింది.
పార్టీని పట్టించుకోని వారిని...
గత రెండున్నరేళ్లుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, నియోజకవర్గానికి దూరంగా ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పది నుంచి ఇరవై మంది నేతల వరకూ చంద్రబాబు పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. వీరంతా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన వారే. వీరందరూ పార్టీని లైట్ గా తీసుకోవడంతో అక్కడ కొత్తవారికి టిక్కెట్ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని అంటున్నారు. మొత్తం మీద సీనియర్లను దాదాపు 99 శాతం మందిని చంద్రబాబు సైడ్ చేసేందుకు రెడీ అయిపోయారు.