మర్డర్ మిస్టరీ వీడిందిలా?

సంచలనం సృష్టించిన చేపల వ్యాపారి హత్య కేసును చేధించారు పోలీసులు.. పక్కా ప్లాన్‌ ప్రకారమే కిడ్నాప్‌ చేసి వ్యాపారిని హత్య చేసినట్లుగా దర్యాప్తులో తేల్చారు.. 48 గంటల్లోనే [more]

Update: 2020-02-09 02:20 GMT

సంచలనం సృష్టించిన చేపల వ్యాపారి హత్య కేసును చేధించారు పోలీసులు.. పక్కా ప్లాన్‌ ప్రకారమే కిడ్నాప్‌ చేసి వ్యాపారిని హత్య చేసినట్లుగా దర్యాప్తులో తేల్చారు.. 48 గంటల్లోనే చేధించిన వ్యాపారీ కిడ్నాప్‌, హత్యకు ప్రధాన కారణం మాత్రం డబ్బుల కోసమేనని విచారణలో వెలుగులోకి వచ్చింది. సెల్‌ సిగ్నల్స్‌, సీసీ కెమెరాల ఫుటేజ్‌ ఆధారంగా కేసు మిస్టరీని చేధించారు పోలీసులు..
తీవ్ర కలకలం రేపిన డెడ్‌బాడీ.

గదిలోంచి దుర్వాసన….
పోలీసులకు ఫిర్యాదు….
గదిని అద్దెకు ఎవరిచ్చారు?

హైదరాబాద్‌లోని సంజీవ్‌రెడ్డినగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జవహర్‌నగర్‌లో ఓ ఇంట్లో వ్యక్తి డెడ్‌బాడీ దొరకడం తీవ్ర కలకలం రేపింది. గదిలోంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి యజమాని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుర్వాసన వస్తున్న గది తలుపులు తీసిన పోలీసులు, నల్లటి ప్లాస్టిక్‌ బ్యాగుల్లో ఓ వ్యక్తి శరీర భాగాలు చూసి ఖంగుతిన్నారు. దారుణంగా హత్య చేసిన వ్యక్తిని చేతులు నరికి ప్లాస్టిక్‌ కవర్‌లలో తరలించేందుకు ప్లాన్‌ చేసినట్లుగా గుర్తించారు. వెంటనే ఆ గదిని అద్దెకు ఎవరికి ఇచ్చారు? ఎంత కాలంగా అతను ఉంటున్నాడు? రెంట్‌కు ఇచ్చే సమయంలో అతనికి సంబంధించిన ఆధార్‌కార్డు ఏమన్నా తీసుకున్నారా? లేదా? అన్న విషయాలను ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు.

మిస్సింగ్ కేసు నమోదు….

ఎస్‌ ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అప్పటికే చేపల వ్యాపారి రమేష్ మిస్సింగ్‌ కేసు నమోదయ్యింది.. ఈ నెల ఒకటవ తేదీన ఇంటి నుండి బయటికి వెళ్లిన రమేష్ తిరిగి ఇంటికి రాలేదు.. బోరబండలోని రామారావునగర్‌లో నివాసం ఉంటున్న రమేష్, ఒకటవ తేదీ రాత్రి బయటికి వెళ్తున్నానని చెప్పి కనిపించకుండా పోయాడు.. ఆ రోజు రాత్రి రమేష్ ఇంటికి రాకపోవడంతో మరుసటి రోజు ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వ్యాపారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. అతని సెల్‌ నెంబర్‌, సెల్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. కానీ, అప్పటికే జవహర్‌నగర్‌లో దారుణ హత్యకు గురయ్యాడు రమేష్.

డెడ్ బాడీని చూసి…..

జవహర్‌నగర్‌లో లభించిన వ్యక్తి డెడ్‌బాడీని రమేష్ కుటుంబ సభ్యులకు చూపించారు పోలీసులు. దారుణ హత్యకు గురైంది రమేష్ అని గుర్తించారు అతని కుటుంబ సభ్యులు. ఇంత దారుణంగా రమేష్ ను హత్య చేయడానికి గల కారణాల పై దర్యాప్తు ప్రారంభించారు టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు. జవహర్‌నగర్‌ గదిని రాజు నాయక్‌ అనే వ్యక్తి అద్దెకు తీసుకున్నట్లుగా గుర్తించారు. ఈ రాజు నాయక్‌ 2016లో బోరబండలోని రామారావు నగర్‌లో ఉన్న రమేష్ ఇంట్లో కిరాయికి ఉండేవాడు.. సుమారు రెండేళ్ల పాటు ఆ ఇంట్లో అద్దెకు ఉన్న రాజునాయక్‌, రమేష్ పై కన్నేసి ఉంచాడు. అతని వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుండటంతో అతని దృష్టంతా రమేష్ ఆర్థిక లావాదేవీల పైన ఉండేది.. రాజునాయక్‌ అప్పటికే చిన్న చిన్న డాక్యుమెంటరీలో పనిచేశాడు. అంతగా ఆదాయం లేకపోవడంతో స్విగ్గీలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. అయినా అతనికి సరిపడా ఆదాయం లేకపోవడంతో రమేష్ నుండి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలనుకున్నాడు. చేపల వ్యాపారి రమేష్ ఇల్లు ఖాళీ చేసిన తరువాత కూడా అతనితో ఫ్రెండ్‌షిప్‌ కొనసాగించాడు. ఇద్దరూ కలిసి తరచూ మందు పార్టీ చేసుకునేవాళ్లు. రాజునాయక్‌కు అప్పటికే రెండు పెళ్లిల్లు అయ్యాయి..అతను మల్కాజ్‌గిరిలో తన రెండవ భార్య నసీబ్‌తో నివాసం ఉంటున్నాడు. కానీ, రమేష్ కోసమే రాజునాయక్‌ జవహర్‌నగర్‌లో గదిని అద్దెకు తీసుకున్నాడు..

మద్యం తాగేందుకు రమ్మని….

ఈ నెల ఒకటవ తేదీన రమేష్ కు ఫోన్‌ చేసిన రాజు నాయక్‌, తానొక అమ్మాయిని అరేంజ్‌ చేశానని రూమ్‌కు రావాలంటూ చెప్పాడు. అతని మాటలు నమ్మిన రమేష్, జవహర్‌నగర్‌లోని రాజు నాయక్‌ రూమ్‌కు హోండా యాక్టివా మీద వెళ్లాడు. అక్కడికి వచ్చిన తరువాత రాజును మద్యం తేవాలని 500 రూపాయలు ఇచ్చాడు. రాజు, కృష్ణకాంత్‌ పార్క్‌ సమీపంలోని వైన్‌షాప్‌లో మద్యంతో రెండు కూల్‌డ్రింక్‌ బాటిళ్లను కొనుగోలు చేశాడు. ఆ తరువాత మెడికల్‌ షాప్‌లో స్లీపింగ్‌ పిల్స్‌ కూడా తీసుకున్నాడు. గది వద్దకు వచ్చిన తరువాత రమేష్ కు స్లీపింగ్‌ పిల్స్‌ కలిపిన మద్యం తాగించాడు.. అతను స్పృహ కోల్పోయిన తరువాత, ఎల్‌బీ నగర్‌, నాగోల్‌ వద్దకు వెళ్లి, రమేష్ కోడలుకు ఎస్‌ఎంఎస్‌ చేశాడు. రమేశ్‌ను కిడ్నాప్‌ చేశామని, 90 లక్షల రూపాయలు ఇవ్వాలని మెసేజ్‌ పెట్టి గది వద్దకు వచ్చాడు. రూమ్‌కు చేరుకున్న రాజు, స్పృహ కల్పోయి పడి ఉన్న రాజును చూసి ఇతను బతికి ఉంటే కష్టమని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. సుత్తెతో తల పై బలంగా కొట్టడంతో రమేష్ చనిపోయాడు.. అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత అతని మెడలో ఉన్న బంగారు ఆభరణాలను తీసుకొని మల్కాజ్‌గిరికి వెళ్లిపోయాడు.

ఇద్దరూ కలసి…..

రెండవ తేదీ రాత్రి మల్కాజ్‌గిరిలో ఉంటున్న తన రెండవ భార్య నసీబ్‌కు విషయం చెప్పాడు. ఇద్దరు కలిసి జవహర్‌నగర్‌ గది వద్దకు వచ్చి, డెడ్‌బాడీని ప్లాస్టిక్‌ కవర్‌లో తరలించాలనుకున్నారు. ఇందుకోసం తమ వెంట వేట కొడవలిని తీసుకొని వచ్చారు. రమేష్ రెండు చేతులు నరికి, ప్లాస్టిక్‌ కవర్‌లో ఉంచారు. మిగిలిన శరీరభాగాలను ముక్కలు చేద్దామనుకున్నప్పటికి సాధ్యం కాకపోవడంతో అలాగే వదిలేసి పారిపోయారు. పోలీసులకు మిస్సింగ్‌ కేసు రావడం, ఆ తరువాత జవహర్‌నగర్‌ గదిలో డెడ్‌బాడీ దొరకడం అది కూడా రమేష్ దే కావడంతో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఫూటేజీలతో పాటు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా రాజునాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దర్యాప్తులోనూ రాజు, పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు మాత్రం పక్కా ఆధారాలు చూపించారు.

ముత్తూట్‌లో తాకట్టు….

రమేష్ ను కిడ్నాప్‌ చేసి హత్య చేసింది కేవలం డబ్బుల కోసమేనని దర్యాప్తులో గుర్తించారు పోలీసులు. రమేష్ ను హత్య చేసి పారిపోయేందుకు ప్రయత్నించిన రాజునాయక్‌ను మల్కాజ్‌గిరిలో అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. రమేష్ నుండి దొంగిలించిన బంగారు ఆభరణాలను ముత్తూట్‌ గోల్డ్‌లో తాకట్టు పెట్టాడని, వాటిని కూడా రీకవరీ చేశామంటున్నారు పోలీసులు. ఎలాంటి ఆధారాలు లేకుండా గోల్డ్‌ను పెట్టుకున్న ముత్తూట్‌ పై చర్యలు తీసుకుంటామని అంటున్నారు. రాజునాయక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుండి హత్యకు వినియోగించిన సుత్తెతో పాటు వేటకొడవలి, రెండు కత్తులు పోలీస్ స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News