సోముకు మరో ఛాన్స్ లేదా?

బీజేపీ రాష్ట్ర అద్యక్షుడిగా సోము వీర్రాజు పదవీ కాలం త్వరలో పూర్తి కావస్తుంది. ఈ పదవి కోసం మరో వర్గం పోటీ పడుతుంది

Update: 2022-03-30 05:32 GMT

ఎవరు అవునన్నా.... కాదన్నా.. ఏపీ బీజేపీలో రెండు గ్రూపులున్నాయి. ఒకటి జగన్ అనుకూల వర్గం కాగా, రెండోది చంద్రబాబుకు సపోర్ట్ చేసే వర్గం. ప్రస్తుతం కీలక పదవిలో ఉన్న పెద్దాయన వర్గమంతా సోము వ్యతిరేక వర్గంగానే నేటికి కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల నాటికి సోము వీర్రాజు ను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్నది ఈ వర్గం లక్ష్యంగా కన్పిస్తుంది. సోము అధ్యక్ష పదవిలో ఉంటే పొత్తులు కుదరనీయరని, టీడీపీని దగ్గరకు రానివ్వరన్నది ఆ వర్గం విశ్వసిస్తుంది.

త్వరలో పదవీ కాలం....
నిజానికి సోము వీర్రాజు పదవీ కాలం త్వరలో పూర్తి కావస్తుంది. ఆయన స్థానంలో కొత్త వారిని నియమిస్తారా? లేదా సోమును కంటిన్యూ చేస్తారా? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఆయనకు రెండోసారి రెన్యువల్ దొరకలేదు. ఇప్పుడు సోము పరిస్థితి కూడా అంతేనన్నది ఆయన వ్యతిరేక వర్గం భావన. సోము పార్టీ అధ్యక్షుడిగా ఉంటే బీజేపీ, జనసేన, టీడీపీ లు కలిసి పోటీ చేసే అవకాశాలు తక్కువన్నది వారి అభిప్రాయం.
పక్కా ఆర్ఎస్ఎస్....
నిజానికి మిగిలిన ఈ సోకాల్డ్ నేతల్లాగా పార్టీ మారి సోము వీర్రాజు బీజేపీలో చేరలేదు. బీజేపీకి ఏమీ లేనప్పుడే ఆయన పార్టీలో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నేత కావడం, పార్టీని తన సొంత తల్లిలా ప్రేమించడం సోముకు అలవాటు. చంద్రబాబు అనేకమార్లు బీజేపీని మోసం చేసిన విషయాన్ని ఆయన పదే పదే గుర్తు చేస్తుంటారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నందున నాలుగు సీట్లు అయితే రావచ్చేమో కాని, పార్టీ పూర్తిగా బలహీనపడిందన్నది సోము భావన. ఇదే విషయాన్ని పార్టీ అధినాయకత్వానికి కూడా ఆయన నివేదించారు.
బాబు అనుకూల వర్గం....
ఇక సోము వ్యతిరేక గ్రూపులో ఉన్న వారంతా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించేవారే. ఇతర పార్టీల నుంచి వచ్చిన కొందరు నేతలు ఏకమై సోము స్థానంలో మరొకరిని ఎంపిక చేయాలని హైకమాండ్ ను కోరుతున్నారు. వీరికి బీజేపీపై కన్నా చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావాలన్న కసి ఎక్కువగా ఉంది. సోము వీర్రాజు పట్ల పార్టీ హైకమాండ్ సానుకూలతతో ఉందంటున్నారు. వచ్చే ఎన్నికల వరకూ ఆయనను కొనసాగించినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సోమును పదవి నుంచి తప్పిస్తే తమ పని సులువవుతుందన్నది బీజేపీలోని ఒక వర్గం ఆలోచన. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News