జగన్ అలా ఇచ్చుకుంటూ పోతే...?
త్వరలో ఏపీ లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ పదవుల కోసం వైసీపీలో ఇప్పటి నుంచే అనేక మంది ఆశలు పెట్టుకున్నారు
త్వరలో ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ పదవుల కోసం వైసీపీలో ఇప్పటి నుంచే అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. ఆశావహులు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. అయితే ఇప్పటికే జగన్ కొందరి పేర్లను ఖరారు చేశారంటున్నారు. అందులో మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ఒకరు. ఈయన విషయంలో పెద్దగా ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. తొలి నుంచి ఆయన పార్టీలో ఉండటమే అందుకు కారణం.
నాలుగు స్థానాలు....
వచ్చే జూన్ 21వ తేదీ నాటికి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుత బీజేపీ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభుతో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. ఈ నాలుగు పదవులు వైసీపీకే దక్కుతాయి. దీంతో వైసీపీలో పోటీ పెరిగింది. విజయసాయిరెడ్డికి జగన్ మరోసారి రెన్యువల్ చేయనున్నారు. మిగిలిన మూడు పదవులపైనే వైసీీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు.
ఢిల్లీ నుంచి పైరవీలు...
ఏపీ నుంచి రాజ్యసభ పదవులు నాలుగు ఖాళీ అవుతుండటంతో బీజేపీ నుంచి వత్తిడి పెరుగుతున్నట్లు తెలిసింది. జగన్ కు కొన్ని పేర్లను సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు. గతంలో సురేష్ ప్రభు, నిర్మలా సీతారామన్ వంటి వారు రాజ్యసభకు ఎన్నికయ్యారు. పారిశ్రామికవేత్తలు సయితం రాజ్యసభ పదవి కోసం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టే అవకాశముంది. మొన్న భర్తీ చేసినప్పుడు జగన్ అంబానీకి సన్నిహితుడైన పారిశ్రామికవేత్త పరమళ్ నత్వానీకి ఇచ్చారు. ఆయన వల్ల ఇప్పటి వరకూ రాష్ట్రానికి ఒరిగింది కూడా ఏమీ లేదు.
పారిశ్రామికవేత్తలు...
అందుకే పారిశ్రామికవేత్తలకు ఈసారి నో చెప్పే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావు పేరు వినపడుతుంది. అయితే ఇప్పటికే నెల్లూరు జిల్లాలో రాజ్యసభ సభ్యులు ఎక్కువగా ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన వారే. అదే జిల్లాలో ఉన్న సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డికి కాదని బీద మస్తాన్ రావుకు రాజ్యసభ స్థానం ఇస్తే పార్టీలో అసంతృప్తి తలెత్తే అవకాశముంది.
బీదకు ఇవ్వవద్దంటూ.....
బీసీ కోటాలో ఇప్పటికే రాజ్యసభ పదవులు కొందరికి దక్కిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రతి సారీ సామాజిక సమీకరణాలంటూ తమను పక్కన పెట్టేస్తున్నారంటూ పార్టీ కోసం కష్టపడిన నేతల పక్కన పెట్టడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతాయి. 2019 ఎన్నికల ఫలితాల తర్వాతనే బీద మస్తాన్ రావు వైసీపీలోకి వచ్చారు. ఆయన సోదరుడు బీద రవిచంద్ర టీడీపీలో కీలక నేతగా ఉన్న విషయాన్ని నొక్కి చెబుతున్నారు. మొత్తం మీద ఈసారి రాజ్యసభ పదవుల విషయంలో పారిశ్రామికవేత్తలు, జంపింగ్ నేతలను పక్కన పెట్టాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. మరి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.