న్యూఢిల్లీ : సాధారణంగా రుతుపవనాలు మే నెలాఖరు, జూన్ మాసాల్లో వస్తాయి. కానీ ఈసారి వారం ముందు రుతుపవనాల ఆగమనం ఉంటుందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఆదివారం దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా రుతుపవనాలు ద్వీపాలకు రానున్నట్లు ఐఎండీ పేర్కొంది. ఈ ద్వీపాల్లో రానున్న 24 గంటల్లో రుతుపవనాల ప్రభావంతో 64.5 మి.మీ నుండి 115.4 మి.మీ వర్షపాతం నమోదుకావచ్చని ఐఎండీ అంచనా.
రుతుపవనాల ప్రభావంతో రేపు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు ఐఎండీ హై అలర్ట్ ప్రకటించింది. "అరేబియా సముద్రం నుండి దక్షిణ ద్వీపకల్ప భారతదేశం వైపు వీచే బలమైన పశ్చిమ గాలుల కారణంగా, కేరళ, కోస్తా కర్ణాటక, తమిళనాడు, మహే, లక్షద్వీప్‌లలో మే 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది" ఐఎండీ ఆదివారం ఉదయం తెలిపింది.