24 గంటల్లో.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి ద్రోణి నేడు బలహీన పడింది. రానున్న 24 గంటల్లో ఈశాన్య, దాని..
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడ్రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకూ ఈ ఆవర్తనం విస్తరించి ఉందని, నైరుతి దిశగా వెళ్తోందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇక శుక్రవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి ద్రోణి నేడు బలహీన పడింది. రానున్న 24 గంటల్లో 24 గంటల్లో ఈశాన్య, దాని పరిసరాల్లోని తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. అలాగే ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నట్లు పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉండటంతో.. దాని ప్రభావం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పైనే అధికంగా ఉంటుంది. ఇప్పటికే కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. తీరంవెంబడి గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అమరావతి, విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.