సింగిల్ టైం... కొందరంతే...!

తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. ఆమెకు రాజకీయంగా అవకాశాలు లేనట్లే.

Update: 2023-03-25 06:02 GMT

కొంత మంది అంతే.. అలా వచ్చి అలా వెళ్లిపోతారు. అదృష్టం తలుపుతట్టినా ఆలస్యంగా తెరిచే దురదృష్టవంతులు కొందరుంటారు. రాజకీయాల్లోనూ అంతే. చదువు, సామర్థ్యం, సామాజికవర్గం అన్నీ ఉండి అవకాశాలు రాని వారు అనేక మంది ఉంటారు. కోటిలో ఏ ఒక్కరికో పాలిటిక్స్ లో అవకాశం దొరుకుతుంది. దానిని సద్వినియోగం చేసుకోలేకపోతే ఇక అంతే. తొలి విడతతోనే తెరమరుగవుతుంటారు. తాత్కాలిక ప్రలోభాలకు ఆశపడితే శాశ్వతంగా దూరమయిన వాళ్లను రాజకీయాల్లో అనేకమందిని చూశాం. అందులో లక్ కొద్దీ తొలిసారి ఎమ్మెల్యే అయి తర్వాత స్యయంకృతాపరాధంతో రాజకీయ జీవితానికే ఫుల్ స్టాప్ పెట్టుకున్న వాళ్లను చాలా మందిని చూశాం. అందులో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఒకరు.

డాక్టర్ గా సక్సెస్ అయి...
డాక్టర్ గా యమ బిజీగా ఉండే శ్రీదేవి తాను రాజకీయాల్లోకి వస్తానని ఊహించలేదు. వైఎస్ భారతితో పరిచయం ఆమె జీవితాన్ని మార్చింది. భారతి సిఫార్సుతో ఆమెకు తాడేపల్లి టిక్కెట్ జగన్ ఇచ్చారంటారు. డాక్టర్ గా సక్సెస్ అయిన ఉండవల్లి శ్రీదేవి పొలిటికల్ కూడా తొలి అడుగులోనే విజయం సాధించగలిగారు. అదీ జగన్ చరిష్మాతో అని వేరే చెప్పాల్సిన పనిలేదు. కానీ చక్కగా పనిచేసుకోవాల్సిన శ్రీదేవి గ్రూపులకు తెరదీశారు. తాడికొండలో తనకు తలనొప్పి తానంతటే తెచ్చుకున్నారు. తాడేపల్లి వైసీపీ రెండు వర్గాలుగా విడిపోవడానికి ఆమె కారణమయ్యారు. జగన్ ఫ్యామిలీతో ఉన్న సంబంధాలను కూడా ఆమె వినియోగించుకోలేకపోయారు.
గ్రూపులను ప్రోత్సహించి...
తద్వారా గెలిచిన తర్వాత కొద్ది రోజులకే తాడికొండ నియోజకవర్గంలో అసంతృప్తి బయలుదేరినా పార్టీ పెద్దలకు చెప్పి సరి చేసుకోక పోగా కోతిపుండు బ్రహ్మరాక్షసిగా చేసుకున్నట్లు ఆమె మరింత సమస్యను పెద్దదిగానూ, జటిలంగానూ చేసుకున్నారు. దీంతో పార్టీ అధినాయకత్వం అక్కడ మరొకరిని సమన్వయ కర్తగా నియమించే పరిస్థిితిని తనంతట తానే తెచ్చుకున్నారు. కేవలం ఒక వర్గాన్ని వెనకేసుకు రావడం, అక్కడి ఆధిపత్యం ఉన్న సామాజికవర్గంతో తలపడటం ఉండవల్లి శ్రీదేవికి తలనొప్పి తెచ్చిందని చెప్పాలి. అంతటితో ఆగినా సరిపోయేది. కానీ ఆమె ఊరుకోలేదు. మరింత కాలుదువ్వారు. దీంతో ఆమెపై ఉన్న వ్యతిరేకతను గమనించి అధిష్టానం ఎమ్మెల్సీ ఎన్నికలలో డొక్కా మాణిక్యవరప్రసాద్ ను ఎంపిక చేయకుండా క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ లేదని నేరుగానే చెప్పింది. దీంతో ఉండవల్లి శ్రీదేవి తనకు టిక్కెట్ రాదని డిసైడ్ అయిపోయారు.
ఏ దారీ లేదు...
పోనీ వేరే పార్టీలోకి వెళితే ఎలాంటి పదవులు దక్కవు. వారు ఇచ్చిన హామీలు కూడా అమలు కావని ఆమెకు తెలియంది కాదు. తమ ప్రయోజనం నెరవేరిన తర్వాత అసలు మొఖం కూడా చూడని వైపు ఆమె టర్న్ అయ్యారు. పోనీ జగన్ ను కలసినప్పుడు ఆమెకు అక్కడి నుంచి మార్చి వేరే చోట టిక్కెట్ ఇస్తామని చెప్పినా ఆమె విని ఉంటే బాగుండేది. మరోచోట టిక్కెట్ లేదో మరోసారి ఎమ్మెల్సీ పదవి అయినా దక్కేది. అలా కాకుండా క్రాస్ ఓటింగ్ కు పాల్పడి ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిగా మారిపోయారు. ఇప్పుడు ఆమెకు వేరే దారి లేదు. రాజకీయంగా ప్రభావం చూపగలిగిన నేత అయినా ఏదో ఒక పార్టీ దరిచేర్చుకునేది. కానీ డాక్టర్ కు ఆ క్వాలిఫికేషన్ కూడా లేదు. ఈ ఏడాది కాలంలో ఆమె నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అక్కడ కాలు మోపితే వైసీపీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకమవుతుంది. ఇలా తొలిసారి ఎమ్మెల్యే అయి సింగిల్ టైం శాసనసభ్యురాలిగా మిగిలిపోయిన ఉండవల్లి శ్రీదేవి తనంతట తానే రాజకీయంగా జీవితాన్ని సమాధి చేసుకున్నారు.


Tags:    

Similar News