తారకరత్న హెల్త్ బులెటిన్.. అత్యంత విషమంగా ఆరోగ్యం
ప్రస్తుతం తారకరత్నకు ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నాం అని వైద్యులు తాజా బులెటిన్ లో..
ప్రముఖ టాలీవుడ్ హీరో, టీడీపీ నేత నందమూరి తారకరత్న నిన్న లోకేష్ పాదయాత్రలో గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. తొలుత కుప్పం ఆస్పత్రిలో ఆయనకు చికిత్స చేయగా.. మెరుగైన వైద్యం కోసం అర్థరాత్రి 1 గంటకు ప్రత్యేక అంబులెన్స్ లో బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి ఆయన్ను తరలించారు. వైద్యులు ఆయనకు ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఆస్పత్రి వైద్యులు తారకరత్న హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రత్యేక వైద్యబృందం ఆధ్వర్యంలో చికిత్స చేస్తున్నట్లు పేర్కొన్నారు. బెలూన్ యాంజియోప్లాస్టి ద్వారా రక్తాన్ని పంపింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం తారకరత్నకు ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నాం అని వైద్యులు తాజా బులెటిన్ లో తెలిపారు. తొలుత తారకరత్న కళ్లుతిరిగి పడిపోయారని భావించి కేఈసీ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిచారు. ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో.. పల్స్ పూర్తిగా పడిపోయి, రీరం కూడా బ్లూగా మారిందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రికి తరలించిన 45 నిమిషాల అనంతరం ఆయన పల్స్ తిరిగి ప్రారంభం అయిందని డాక్టర్లు వెల్లడించారు. ఇక ఆక్కడి నుంచి కుప్పం మెడికల్ కాలేజీకి తరలించి సీపీఆర్, యాంజియోగ్రామ్ కూడా చేశారు. అయితే ఆయన గుండెకు రెండు వైపులా బ్లాక్స్ వున్నాయని అందువల్ల రక్తం సరఫరా కావడం లేదన్నారు. అత్యవసర చికిత్స కోసం బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు.