పైసల్ లేవ్ బాబూ.. అవి మానుకోవయ్యా?

టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతికే పరిమితమయ్యారు. ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం ఎందుకు చేయడం లేదన్న చర్చ జరుగుతుంది.

Update: 2021-12-16 04:23 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అమరావతికే పరిమితమయ్యారు. ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం ఎందుకు చేయడం లేదన్న చర్చ పార్టీలో జరుగుతుంది. ఇంకా ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉందనా? లేదా ఆర్థిక ఇబ్బందులా? అన్నది అర్థం కాకుండా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా తయారైంది. అలాగే టీడీపీ ఖజానా కూడా బోసిపోయిందట. చంద్రబాబు ఫక్తు రాజకీయ నాయకుడు. ఆయన ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండరు. కరోనా తీవ్రత దృష్ట్యా వైద్యుల సూచనల మేరకు చంద్రబాబు గత ఏడాదిన్నరగా ప్రజల్లోకి వెళ్లడం మానుకున్నారు.

కొన్ని కార్యక్రమాలకే....
తిరుపతి ఉప ఎన్నిక, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మాత్రమే ఆయన వెళ్లారు. ఇక రాజధాని రైతులు తిరుపతిలో పెట్టే సభకు కూడా చంద్రబాబు హాజరవుతున్నారు. అంతే తప్ప ఆయన జిల్లాల పర్యటనకు మాత్రం ఇష్టపడటం లేదంటున్నారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఉండి రోజుకో జిల్లాను సమీక్ష చేస్తున్నారు. జిల్లాల నేతలను తన వద్దకు పిలిపించుకుని ఆయన క్లాస్ లు పీకుతున్నారు. అమరావతిలో చంద్రబాబు ఉంటేనే రోజుకు లక్షల్లో ఖర్చవుతుందట.
టూర్లు లేకపోవడానికి...
అయితే చంద్రబాబు జిల్లాల పర్యటన చేయకపోవడానికి కారణాలపై అనేక రకాలుగా చర్చ జరుగుతుంది. చంద్రబాబు విశాఖకు వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తుంది. పల్లా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ దీక్ష విరమింప చేసేందుకు అలా వచ్చి ఇలా వెళ్లారు. ఇక రాయలసీమలో వరద ప్రాంతాల్లో ఇటీవల పర్యటించినా ఎక్కడా పార్టీ నేతలను కలుసుకోలేదు. కోస్తాంధ్రలో కొంత టీడీపీకి సానుకూలత ఉన్నా అక్కడ పర్యటించేందుకు చంద్రబాబు ఇప్పుడే వద్దని చెబుతున్నట్లు తెలిసింది.
ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుందని....
చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరిని అసెంబ్లీలో అవమానించారని కన్నీరు పెట్టుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో గౌరవ సభలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మూడు ప్రాంతాల్లోనూ గౌరవ సభలను నిర్వహించాలని తొలుత నిర్ణయించినా పార్టీ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వాటిని విరమించుకున్నారని తెలిసింది. చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళితే ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుంది. జిల్లా పార్టీ లు భరించే పరిస్థితి లేదు. కేంద్ర కార్యాలయం కూడా ఖర్చులు తగ్గించుకోవలని సూచించడంతో చంద్రబాబు, లోకేష్ లు పర్యటనలు తగ్గించుకున్నారన్న టాక్ పార్టీలో వినపడుతుంది.


Tags:    

Similar News