ఎవరు దిగొస్తారు.. పొత్తుల ఊసులివీ
టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి పొత్తులతోనే ఎన్నికల గోదాలోకి దిగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా రాజకీయం మాత్రం ఎప్పుడో హీటెక్కింది. పాదయాత్రలు మొదలవుతున్నాయి. బస్సు యాత్రలు కూడా షురూ అవుతున్నాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి పొత్తులతోనే ఎన్నికల గోదాలోకి దిగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే పొత్తులు కుదరకపోయినా క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు మానసికంగా ఒకటయిపోయారు. కలసి పోటీ చేద్దామన్న నిర్ణయానికి వచ్చారు. పార్టీ అధినేతలు కలవకపోయినా ఏదైనా ఆందోళన కార్యక్రమాల్లో రెండు పార్టీల కార్యకర్తలు కలసి పాల్గొంటున్నారు.
ఇప్పటికే క్షేత్రస్థాయిలో...
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకరికి ఒకరు అండగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే జగన్ ను గద్దె దించడానికి ఈసారి చంద్రబాబు ఎలాంటి త్యాగాలకయినా సిద్ధపడతారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. జగన్ ను అధికారంలో నుంచి దించడమే లక్ష్యంగానే చంద్రబాబు నిర్ణయాలు ఉంటాయన్నది కాదనలేని వాస్తవం. అది ఏ రూపంలో ఉంటాయన్నది చెప్పలేం. పార్టీ నేతలతో పాటు తన కుటుంబం నుంచి కూడా కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ గతంలో మాదిరి నేత కాదు. ఆయన ఈ పన్నెండేళ్ల కాలంలో రాజకీయంగా రాటుదేలారు.
అంత అమాయకుడైతే కాదు...
పవన్ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు వస్తాయన్నది ముందుగా ఊహించలేనంత అమాయకత్వంలో అయితే టీడీపీ అధినేత ఉండరనే అనుకోవాలి. నలభై ఏళ్లకు పైగానే రాజకీయ అనుభవం ఉన్న నేత కావడంతో ఏ ఏ ప్రతిపాదనలతో పవన్ కల్యాణ్ చర్చలకు వస్తారన్న అంచనా ఆయన వేయగలరు. ఇప్పటికే చంద్రబాబు దానిపైన కూడా ఒక క్లారిటీకి వచ్చారంటారు. గతంలో మాదిరి రాష్ట్ర పరిస్థితులు ఇప్పుడు లేవు. 2009లోనే చిరంజీవి ప్రజారాజ్యం దెబ్బకు తాను ఓటమి చెందానని చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకోసం పవన్ ను దూరం చేసుకునేంత రాజకీయ అజ్ఞానంలో ఉండరు. ఆయనకు తొలి నుంచి రాజకీయంగా ఉన్నదే అది. నాయకత్వం, ముందుగా అంచనా వేయడంలో చంద్రబాబు దిట్ట.
మానసికంగా ప్రిపేర్...
అందుకే పవన్ కల్యాణ్ నుంచి ఎటువంటి ప్రతిపాదన వచ్చినా అందులో కొన్ని మార్పులు చేసి మరీ పొత్తును కుదుర్చుకోగల సమర్థత చంద్రబాబుకు ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సపోజ్... పవన్ కల్యాణ‌్ తనకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి అడుగుతారని భావిస్తే అందుకు తన వ్యూహాన్ని తాను ముందుగానే రచించుకుంటారు. ప్రిపేర్ అవుతారు. చివరకు ఐదేళ్లలో రెండున్నేళ్ల సీఎం పంచుకుందామన్న ప్రతిపాదన కూడా తెచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే తమకు ముఖ్యమంత్రి పదవి ఈసారి దక్కాలని కాపులు తిష్టవేసి కూర్చున్నారు. హరిరామ జోగయ్య లాంటి నేతలు కూడా ఇప్పటికే బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.
ఒక్కసారి ఇస్తే తప్పేంటి?
కాపులకు ఒకసారి ముఖ్యమంత్రి పదవి ఇస్తే తప్పేంటి అన్న ప్రశ్న సహజంగానే ఆ సామాజికవర్గంలో నుంచి బలంగా వినపడుతుంది. పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే తమ కూటమి విజయానికి ఢోకా ఉండదని చంద్రబాబు కూడా భావించవచ్చు. పవన్ కల్యాణ్ ను భవిష్యత్ లో రాజకీయంగా తప్పించడం చంద్రబాబుకు సులువే. కానీ జగన్ స్ట్రాంగ్ అయి కూర్చుంటే కష్టమవుతుంది. అందుకే చంద్రబాబు ఈసారి ముఖ్యమంత్రి పదవి విషయంలో పూర్తి కాలం కాకపోయినా కొంత కాలం పవన్ కు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసే అవకాశముంటుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. అలా జగన్ ను గద్దెదించడంతో పాటు తమ పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు చంద్రబాబు రాజీపడక తప్పదన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.