దూరమయ్యారా....? దూరం చేశారా?

టీడీపీ నేత శ్రీభరత్ అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. ఆయన గీతం విద్యాసంస్థల పర్యవేక్షణకే పరిమితమయ్యారు.

Update: 2022-11-02 06:35 GMT

ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీలో కీలకమైన నేత కుటుంబం రాజకీయాలకు దూరం అవుతుందా? టీడీపీలో ఉంటే తమ కుటుంబం ఇక ఎదగలేదని భావించి రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టదలచుకుందా? అంటే అవుననే అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు అతి తక్కువ మందే ఉంటారు. బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉండగా, నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. చంద్రబాబు సరే సరి. ఇక మరో దగ్గర బంధువు, బాలయ్య బాబు అల్లుడు శ్రీభరత్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలనుకున్నారు. తన తాత వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలనుకున్నారు. కానీ కాలం కలసి రావడం లేదు. బాలయ్య బాబు సిఫార్సుతో గత ఎన్నికల్లో టిక్కెట్ వచ్చినా గెలవలేకపోయారు.

ఒకప్పుడు ఆ కుటుంబం...
ఉత్తరాంధ్రలో ఒకప్పుడు ఎంవీవీఎస్ మూర్తి అంటే టాప్ లీడర్. ఆయన పార్టీకి అన్నీ తానే అయి వెనకుండి నడిపేవారు. ఒకరకంగా ఉత్తరాంధ్ర టీడీపీని మూర్తి శాసించేవారు. ఆయన మరణం తర్వాత మనవడు శ్రీభరత్ రాజకీయ వారసత్వాన్ని అందుకోవాలనుకున్నారు. ఎటూ బాలకృష్ణ అల్లుడు కావడం కలసి వచ్చింది. లోకేష్ కో బ్రదర్ కావడంతో ఇంకా పట్టు చిక్కుతుందని భావించారు. 2019 ఎన్నికల్లో ఆయన విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 4, 400 ఓట్లతోనే ఓడి పోయారు. విశాఖ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచినా ఆయన మాత్రం గెలవలేకపోయారు. టీడీపీ నేతలు కొందరు తనకు పని చేయలేదని అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు.
టిక్కెట్ పైనే...
అయినా వారిపై పార్టీ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో శ్రీభరత్ అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. ఆయన గీతం విద్యాసంస్థల పర్యవేక్షణకే పరిమితమయ్యారు. విశాఖ రాజకీయాలను పట్టించుకోవడం లేదు. అసలు పార్టీలో ఉన్నారా? లేదా? అన్నది కూడా అనుమానంగానే ఉంది. మరొక విషయం ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా? లేదా? అన్నది కూడా సందేహంగానే కనిపిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో జరిగిన అవమానం, పార్టీలో నేతలు తనకు చేసిన అన్యాయాన్ని శ్రీభరత్ మర్చిపోలేకపోతున్నారని చెబుతున్నారట. ఒకవేళ యాక్టివ్ అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ వస్తుందన్న నమ్మకమూ శ్రీభరత్ కు లేదు. ఇందుకు కారణం వచ్చే ఎన్నికల్లో టీడీపీ పొత్తులతో వెళ్లడానికి సిద్ధమవ్వడమే.
పొత్తులు పెట్టుకుని...
ఇటు బీజేపీ, అటు జనసేనతో పొత్తు పెట్టుకున్నా విశాఖ పార్లమెంటు స్థానాన్ని టీడీపీ ఇతరులకు కేటాయించే అవకాశాలున్నాయి. తాను భీమిలీ టిక్కెట్ ను గత ఎన్నికల్లో అడిగినా టీడీపీ అధినాయకత్వం ఇవ్వలేదు. ఈసారి కూడా పొత్తుల్లో భాగంగా భీమిలీ వచ్చే అవకాశం లేదు. దీంతో శ్రీభరత్ కొంత అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. తనకు ఎన్ని ట్యాగ్ లు ఉన్నప్పటికీ ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా టీడీపీలో తనను రాజకీయంగా ఎదగనివ్వరన్న ఆలోచనలో ఆయన ఉన్నారని చెబుతున్నారు. అందుకోసమే వ్యాపారాలకే పరిమితమయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. లోకేష్ తోడల్లుడే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటే క్యాడర్ కు ఎలాంటి సంకేతాలు వెళతాయని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఉత్తరాంధ్రలో టీడీపీలోని ఒక పెద్ద కుటుంబం రాజకీయంగా దూరం కావడం చర్చనీయాంశమైంది.


Tags:    

Similar News