లోకేష్ పాదయాత్ర అక్కడ టచ్ చేయదు.. రీజన్ ఇదేనా?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారయింది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారయింది. కుప్పం నియోజకవర్గంలో ఈ నెల 27న మొదలయ్యే పాదయాత్ర వంద నియోజకవర్గాల మీదుగా సాగనుంది. మొత్తం నాలుగు వందల రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. మూడు రోజుల పాటు ప్రతి నియోజకవర్గంలో యాత్ర కొనసాగేలా టీడీపీ ప్లాన్ చేసింది. 25వ తేదీన కడప దర్గా, చర్చిలో ప్రార్థనలు చేసిన అనంతరం 26వ తేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకుని 27వ తేదీన కుప్పం నుంచి తన పాదయాత్రను ప్రారంభిస్తారు.
మూడు జిల్లాల్లో మొత్తం...
చిత్తూరు జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభమై అనంతపురం, కర్నూలు, కడపల మీదుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని అక్కడి నుంచి కోస్తాంధ్ర మీదగా ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో ప్రవేశించి ఇచ్ఛాపురంలో ముగించనున్నారు. అయితే ముఖ్యమైన నియోజకరవర్గాల నుంచి ఈ పాదయాత్ర వెళ్లేలా ప్లాన్ చేశారు. టీడీపీ బలంగా ఉన్నా, బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను కూడా టచ్ చేసేలా పాదయాత్ర రూట్ మ్యాప్ ను ఖరారు చేశారు. చంద్రబాబు సొంత జిల్లా అయిన పాత చిత్తూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి ఈ యాత్ర కవర్ అవుతుంది.
కడప జిల్లాలో మాత్రం...
అలాగే అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పాదయాత్ర వెళ్లనుంది. కర్నూలు జిల్లాలోనూ అన్ని నియోజకవర్గాలను టచ్ చేసేలా పాదయాత్రను రూపొందించారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో మూడు జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల నుంచి లోకేష్ పాదయాత్ర వెళ్లనుంది. కానీ కడప జిల్లాకు వచ్చే సరికి కొన్ని నియోజకవర్గాలకే పరిమితం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నుంచి మాత్రం పాదయాత్ర వెళ్లదు. కడప జిల్లాలో కేవలం ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప, బద్వేలు, కమలాపురం, రాజంపేటల మీదుగా పాదయాత్ర నెల్లూరుకు చేరుకోనుంది. పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాలను మాత్రం వదిలేశారు. దీనిపై పార్టీలో చర్చ జరుగుతుంది.