మూడోసారి "మూడ్" అదేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అన్నీ కలసి వచ్చేటట్లే కనిపిస్తున్నాయి. బీజేపీతో కయ్యం ఈసారి ప్లస్ అయ్యేటట్లే ఉంది.

Update: 2022-03-23 03:36 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అన్నీ కలసి వచ్చేటట్లే కనిపిస్తున్నాయి. బీజేపీతో కయ్యం ఈసారి ప్లస్ అయ్యేటట్లే ఉంది. రెండుసార్లు కేసీఆర్ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చారు. తొలిసారి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నేతగా గెలుపొందగా, రెండోసారి మాత్రం మహాకూటమిని సెంటిమెంట్ గా చూపి మరోసారి గెలిచారు. చంద్రబాబు తెలంగాణ ఎన్నికల బరిలో దిగడంతో రెండోసారి కేసీఆర్ కు వరంగా మారింది. అయితే మూడోసారి మాత్రం ఆయనకు సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు లేవు.

ఏడేళ్లు దాటడంతో....
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు దాటి పోయింది. ఇక అభివృద్ధి గురించే అంతా చర్చ జరుగుతుంది. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతోనే ఏడాదికి తెలంగాణ రైతులు మూడు పంటలు పండిస్తున్నారని కేసీఆర్ జనంలోకి తీసుకెళుతున్నారు. భూముల విలువ ఉమ్మడి రాష్ట్రంలో పది రెట్టు పెరిగిందని చెబుతున్నారు. ఇక ఇప్పటి వరకూ పెద్దగా పట్టించుకోని నిరుద్యోగులకు కూడా కేసీఆర్ వరాలు ప్రకటించారు. అర్హత వయసును పెంచడంతో పాటు దాదాపు 90 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించడం కూడా ఆయనకు ప్లస్ కానుంది.
కాంగ్రెస్ ఎదుగుదల...
మరోవైపు కాంగ్రెస్ ఇక కోలుకోలేదన్నది కేసీఆర్ నమ్మకం. నిజమే ఆ పార్టీ నేతలే దాని ఎదుగుదలకు అవరోధకులుగా మారతారు. వారికి అధికారం కంటే తమ ఆధిపత్యమే ముఖ్యం. అందుకే కాంగ్రెస్ తమకు ఎక్కడా పోటీ కాదన్న ధీమాతో కేసీఆర్ ఉన్నారు. ప్రజలు కూడా కాంగ్రెస్ ను నమ్మి ఓటేయరన్నది ఆయన విశ్వాసం. పైగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పై ఎటువంటి ఆరోపణలు చేయలేని పరిస్థితి. అందుకే కాంగ్రెస్ ను దాని మానానా దానికి వదిలేశారు.
బీజేపీయే టార్గెట్....
బీజేపీ పట్ల ఉత్తరభారతంలో కొంత సానుకూలత ఉన్నా దక్షిణాది రాష్ట్రాల్లో దానికి అంత సీన్ లేదని కేసీఆర్ కు తెలియంది కాదు. బీజేపీ 119 స్థానాల్లో కేవలం పది స్థానాలకు మించి బలం లేదన్నది తెలుసు. కానీ కేసీఆర్ మాత్రం జాతీయ రాజకీయాలంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. తాను జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలంటే ఇక్కడ మరోసారి టీఆర్ఎస్ ను గెలిపించాల్సి ఉంటుందన్న సంకేతాలు పంపారు. మరోసారి గెలిపిస్తే ఇటు రాష్ట్రం అభివద్ధితో పాటు జాతీయ రాజకీయాల్లోనూ తెలంగాణ ప్రాధాన్యత పెంచుతానని ఆయన చెప్పి ప్రజల ముందుకు వెళుతున్నారు. అందుకే ఆయన బీజేపీ పై కాలు దువ్వుతున్నారు. ఈసారి ఆయన వ్యూహం ఫలిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంటుంది.


Tags:    

Similar News