కమ్యునిస్టులతో ఈ కౌగిలింతలేంటి? కొత్తగా లేదూ?

ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. ఆయన వ్యూహాలకు ఎన్నికలకు ముందే పదును పెడుతున్నారు

Update: 2022-01-08 13:02 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. ఆయన వ్యూహాలకు ఎన్నికలకు ముందే పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా కమ్యునిస్టు పార్టీలను కలుపుకుని పోయే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నట్లు కనపడుతుంది. పేరుకు జాతీయ నేతలను కేసీఆర్ కలిసినప్పటికీ ఆయన మనసంతా రాష్ట్ర ఎన్నికలపైనే ఉంది. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ కలవాలన్నది కేసీఆర్ ఉద్దేశం.

సమదూరం....
అయితే బీజేపీ, కాంగ్రెస్ లకు సమదూరంగా ఉంటేనే దేశం బాగుపడుందని ఆయన పదే పదే చెబుతారు. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ దేశంలో అభివృద్ధి సాధ్యమవ్వలేదని, సముద్రంలో వృధాగా పోతున్న నీటిని కూడా 70 ఏళ్లుగా వినియోగించుకోలేకపోయారని తరచూ కేసీఆర్ విమర్శలు చేస్తారు. తాజాగా సీపీఎం, సీపీఐ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత సీపీఐ నేతలు డి. రాజాతో భేటీ అయి దేశ పరిస్థితులపై చర్చించారు.
జాతీయ స్థాయి నేతలతో....
కానీ కేసీఆర్ జాతీయ స్థాయి నేతలతో చర్చలు జరిపినా, దేశంలో బీజేపీ వ్యతిరేక పార్టీలు కూడగట్టాలని ప్రయత్నాలు ప్రారంభించినా చివరకు రాష్ట్ర ఎన్నికలపైనే ఆయన దృష్టి ఉంటుందంటున్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు కానుండటంతో సహజంగా వచ్చే ఎన్నికల్లో ప్రజలలో వ్యతిరేకత ఉంటుంది. ఈ వ్యతిరేకత నుంచి బయటపడటానికి కమ్యునిస్టుల సహకారం తీసుకోవాలన్నది కేసీఆర్ వ్యూహంలో ఒక భాగంగానే చూడాల్సి ఉంటుంది.
వచ్చే ఎన్నికల్లో....
నిజంగా ఏపీలో కంటే తెలంగాణలో కమ్యునిస్టులకు కొన్ని ప్రాంతాల్లో బలముంది. పటిష్టమైన క్యాడర్ తో పాటు ఓటు బ్యాంకు కూడా ఉంది. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్లగొండ వంటి ప్రాంతాల్లో కమ్యునిస్టుల సహకారంతో అధికారంలోకి మళ్లీ వచ్చే అవకాశముంది. వారికి కూడా శాసనసభలో ప్రాతినిధ్యంలేదు. అధికార పార్టీతో కలసి నడవటానికి వారు కూడా ఉత్సాహంగానే ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో కమ్యునిస్టులతో కలసి కేసీఆర్ ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.


Tags:    

Similar News