ఢిల్లీలోనే ధర్నా.. కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఇదే
కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. నేడు టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది
కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. నేడు టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంపై వత్తిడి తేవడానికి కేసీఆర్ ఈ సమావేశంలో కార్యాచరణను ప్రకటించనున్నారు. గ్రామ స్థాయిలో బీజేపీని దెబ్బకొట్టేందుకు ధాన్యం కొనుగోళ్ల అంశం అధికార పార్టీకి ఉపయోగపడుతుందన్న అంచనాలో ఉన్నారు.
నేటి సమావేశంలో....
ఈరోజు జరిగే శాననసభ సమావేశంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నుంచి స్పష్టత రాకపోతే ఏం చేయాలన్న దానిపై నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు. ఇప్పటికే ఫాంహౌస్ లో మంత్రులతో సమావేశమైన కేసీఆర్ దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను తయారు చేశారు. శాసనసభ పక్ష సమావేశం ముగిసిన వెంటనే అందరితో కలసి ఢిల్లీ టూర్ ను ఆయన ప్లాన్ చేశారు. ఢిల్లీలోనే తేల్చుకోవడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు.
ఢిల్లీలోనే మకాం...
ఇందుకోసం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ను కోరింది. ఒకవేళ ప్రధాని అపాయింట్ మెంట్ లభించకపోతే ఢిల్లీలో కేసీఆర్ ధర్నాకు దిగే అవకాశముంది. పంజాబ్ తరహాలో వంద శాతం ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న డిమాండ్ తో కేసీఆర్ ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నారు. ఈ సమావేశానికి కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే కాకుండా జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు కూడా హాజరుకానున్నారు. నాలుగైదు రోజులు కేసీఆర్ మంత్రులతో కలసి ఢిల్లీలో మకాం వేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.