ఠాగూర్ పోయె...థాక్రే వచ్చే

తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి పదవి నుంచి మాణికం ఠాగూర్ ను తప్పించింది. మాణక్‌రావు థాక్రేను నియమించింది

Update: 2023-01-05 02:28 GMT

ఎట్టకేటలకు సీనియర్ కాంగ్రెస్ నేతల డిమాండ్ కు కాంగ్రెస్ తలొగ్గింది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి పదవి నుంచి మాణికం ఠాగూర్ ను తప్పించింది. ఆయన స్థానంలో మహారాష్ట్రకు చెందిన మాణక్‌రావు థాక్రేను నియమించింది. ఇటీవల పరిశీలకుడిగా వచ్చిన దిగ్విజయ్ సింగ్ కు సీనియర్ నేతలందరూ మాణికం ఠాగూర్ పైనే ఫిర్యాదులు చేశారు. నేతలను సమన్వయం చేసుకోవడంలో ఆయన విఫలమయ్యారని చెప్పారు. ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా తమకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్ దృష్టికి తీసుకొచ్చారు.

డిగ్గీ రాజా నివేదికతో...

అందరి ఫిర్యాదులు మాణికం ఠాగూర్ పైనే ఉండటంతో ిదిగ్విజయ్ సింగ్ కూడా ఠాగూర్ ను మార్చాల్సిందేనన్న నివేదికన పార్టీ హైకమాండ్‌కు ఇచ్చినట్లు తెలిసింది. లేకుంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోపార్టీ మరింత కష్టాలు పడుతుందని హెచ్చరించారు. ఇది తెలుసుకున్న మాణికం ఠాగూర్ సయితం తనంతట తానుగా పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన నేరుగా రాహుల్ వద్దకు వెళ్లి తనను తెలంగాణ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించాలని కోరినట్లు చెబుతున్నారు. నిన్న ఉదయమే మాణికం ఠాగూర్ ను తప్పిస్తున్నట్లు కొంత ఉప్పందంది. ఆయన చేస్తున్న ట్వీట్లు అందుకు అద్దం పట్టాయి.

గోవా ఇన్‌ఛార్జిగా...

సాయంత్రానికి కొత్త ఇన్‌ఛార్జి నియామకం జరిగిపోయింది. మహారాష్ట్రకు చెందిన మాణిక్‌రావు థాక్రేను నియమిస్తున్నట్లు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. మాణిక్‌రావు థాక్రే గతంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేశారు. అధిష్టానానికి నమ్మకమైన నేతగా పేరుంది. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన మాణిక్‌రావు థాక్రే ను చివరకు నియమించింది. మాణికం ఠాగూర్ ను గోవా పార్టీ వ్యవహరాల ఇన్‌ఛార్జిగా నియమించింది. థాక్రే అయినా పార్టీ నేతలందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని ఆ పార్టీ క్యాడర్ కోరుతున్నారు.


Tags:    

Similar News