కౌగిలింతలు.. కేకేకు కష్టాలు మొదలయినట్లేనా?
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ చాలా మొండిగా ఉంటారు. తాను కాదన్న వారి ముఖం చూడటానికి కూడా ఆయన ఇష్టపడరు;
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ చాలా మొండిగా ఉంటారు. తాను కాదన్న వారి ముఖం చూడటానికి కూడా ఆయన ఇష్టపడరు. ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకూ అనేక మంది నేతలు పార్టీ నుంచి వారంతట వారుగా వెళ్లిపోయిన వారు కొద్ది మందే. ఎక్కువ మంది కేసీఆర్ నుంచి గెంటివేయబడ్డవారే. ఒక డి.శ్రీనివాస్ కావచ్చు. స్వామిగౌడ్, కోదండరామ్, కొండా సురేఖ వంటి వారిని కేసీఆర్ బయటకు పంపారు. వారంతట వారే కొందరు వెళ్లిపోయినా ఆ పరిస్థితిని కల్పించింది ఖచ్చితంగా కేసీఆర్.
మళ్లీ దరిచేర్చుకోవడం....
ఒకసారి తనను వీడి వెళ్లిన వారిని తిరిగి దరి చేర్చుకోవడమన్నది కేసీఆర్ హిస్టరీలో లేదు. ఎంతగా ప్రేమిస్తారో అంత ద్వేషిస్తారన్నది ఆయనను దగ్గర నుంచి చూసిన వారికి మాత్రమే తెలుసు. సామాజికవర్గాల వారీగా అస్సలు చూసుకోరు. తనకు నచ్చిన వారిని మాత్రం అందలం ఎక్కించడం కేసీఆర్ కు ఇష్టం. నచ్చితే ఎన్ని పదవులైనా ఇస్తారు. ఇందులో రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు ఒకరు. ఆయన రాజ్యసభ పదవిని రెన్యువల్ చేశారు. రాజ్యసభలో పదవిని కట్టబెట్టారు.
కీలక పదవులతో....
ఇక ఆయన కుమార్తెను ఎవరూ ఊహించని విధంగా జీహెచ్ఎంసీ మేయర్ ను చేశారు. కేకే ను ఎన్నికల మ్యానిఫేస్టోకు ఛైర్మన్ గా కూడా చేశారు. అలాంటి కె.కేశవరావు ఇప్పుడు కేసీఆర్ గెంటేసిన ఈటల రాజేందర్ ను కౌగిలించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకసారి కేసీఆర్ కాదంటే అటువైపు చూడటానికి కూడా టీఆర్ఎస్ నేతలు భయపడతారు. అలాంటి కేకే ఈటలతో మాటా మంతితో కష్టాల్లో పడినట్లేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
ఇప్పుడు కాకపోయినా....
ఈటల రాజేందర్ ను తాను పదవి నుంచి తప్పిస్తే ఆయన సవాల్ చేసి మరీ ఉప ఎన్నికల్లో గెలుపొందారు. గెలవకపోయినా కేసీఆర్ కు కొంత సాఫ్ట్ కార్నర్ ఉండేది. ఈటలను ఓడించాలని హుజూరాబాద్ లో అనేక మందికి పదవులు ఇచ్చారు. కానీ తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈటల గెలవడాన్ని కేసీఆర్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు సీనియర్ నేత, తనకు అత్యంత ఆప్తుడిగా ఉన్న కేకే ఈటలను ఒక ఫంక్షన్ లో కలసి కౌగిలించుకోవడం అస్సలు ఇష్టపడరంటున్నారు. ఇప్పుడు కాకపోయినా ఈటల ఎఫెక్ట్ కేకేపై ఖచ్చితంగా ఉంటుందని చెప్పక తప్పదు.