ముందు...ముందు ఇంకా సౌండ్ పెరుగుతుందేమో?
తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ తో పోటీ పడుతుంది. అక్కడి సమస్యలను ఎత్తి చూపుతుంది.
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో లేదా ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలోనూ రాజకీయ పార్టీలు గత ప్రభుత్వాలకు, ఈ ప్రభుత్వాలకు తేడా ఏంటో ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాయి. తమ ప్రభుత్వంలో తీసుకువచ్చిన సంక్షేమ పథకాలతో పాటు గత ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజల ముందుంచి ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేస్తాయి. ఏ రాజకీయ పార్టీ ఇందుకు అతీతం కాదు. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య తేడాపై ఎక్కువ చర్చ జరుగుతుంటుంది. గత ప్రభుత్వం అమలు చేయనన్ని సంక్షేమ పథకాలను తాము అమలు చేశామని ప్రభుత్వం చెప్పుకుంటుంది. అదే ప్రతిపక్షం కూడా ఇప్పటి ప్రభుత్వం గతంలో తాము అమలు చేసిన పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తుంది.
ఆ వెసులుబాటు...
ఆంధ్రప్రదేశ్ లో ఆ వెసులుబాటు ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత అక్కడ రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం గత టీడీపీ పాలనపై విమర్శలు చేస్తుంటే ప్రతిపక్ష టీడీపీ ప్రస్తుత వైసీపీ వైఫల్యాలను ఎండగడుతుంటుంది. కానీ తెలంగాణలో అధికార పార్టీకి ఆ ఛాన్స్ లేదు. దానికి కారణం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒకే పార్టీ అధికారంలో ఉండటమే. సమైక్యాంధ్రలో సమస్యలు ప్రస్తావిద్దామంటే ఎనిమిదేళ్లు దాటి పోయింది. దానిని ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ఎనిమిదేళ్లలో మీరు ఏం చేశారన్న ప్రశ్న మాత్రమే తలెత్తుతుంది.
పొరుగు రాష్ట్రంతో...
అందుకే తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ తో పోటీ పడుతుంది. అక్కడి సమస్యలను ఎత్తి చూపుతుంది. అక్కడ ఎవరు అధికారంలో ఉన్నారన్నది ముఖ్యం కాదు. అక్కడ ఏ పథకాలు అమలు జరుగుతున్నాయన్నది వారికి పట్టదు. అక్కడ లోటు పాట్లను ఇక్కడ తమకు అనుకూలంగా మలచుకోవడానికే ప్రయత్నిస్తారు. మొన్నా మధ్య మంత్రి కేటీఆర్ అక్కడ రోడ్ల పరిస్థితిపై వ్యాఖ్యలు చేశారు. తనకు మిత్రులు ఫోన్ చేసి చెప్పారని, ఏపీలో రోడ్లపై ప్రయాణించాలంటే రోగాల బారిన పడతారని చెప్పారని, తెలంగాణ నుంచి బస్సులను ఏపీకి పంపి చూపించాలని కోరారాని కేటీఆర్ చెప్పారు. ఇక తాజాగా హరీశ్ రావు కూడా ఆంధ్రప్రదేశ్ పై విమర్శలు చేస్తున్నారు.
విద్యుత్తు.. రోడ్లు.. ఉపాధ్యాయులపై...
తనకు తిరుపతిలో కొందరు ఆంధ్ర మిత్రులు కలిశారని వారు అక్కడ విద్యుత్తు గ్రామాల్లో మూడు, నాలుగు గంటలు మాత్రమే ఉంటుందని చెప్పారన్నారు. తెలంగాణలో విద్యుత్తు 24 గంటలు ఇస్తున్నామని చెప్పుకున్నారు. ఇక ఉపాధ్యాయులను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుందని, అక్రమ కేసులు బనాయిస్తుందని హరీశ్ రావు అన్నారు. కానీ తెలంగాణలో ప్రభుత్వం ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందో గమనించారా? అంటూ ఉపాధ్యాయ సంఘం సమావేశాల్లో అన్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణ నేతలు ఏపీతో పోటీ పడతారు. అయితే దీనికి ధీటుగా సోషల్ మీడియాలో మాత్రం హైదరాబాద్ లో వర్షం వస్తే సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా ఎందుకు ప్రకటించరని ఏపీ నుంచి కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎన్నికలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల నుంచి సవాళ్లు, ప్రతిసవాళ్లు రాను రాను మరింత ఎక్కువగా వినిపించక మానవు.