చంద్రబాబును ఆ బ్యాడ్ లక్ వెంటాడుతుందా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఒక దురదృష్టం వెంటాడుతుంది. ఆయన వరసగా ఎప్పుడూ గెలిచింది లేదు

Update: 2022-01-24 07:08 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఒక దురదృష్టం వెంటాడుతుంది. ఆయన వరసగా ఎప్పుడూ గెలిచింది లేదు. ఆయన ప్రత్యర్థులు మాత్రం వరస గెలుపులు సాధించారు. 1995లో ఎన్టీఆర్ నుంచి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత 1999లోనే ఒకసారి గెలిచారు. అంటే ఆ గెలుపు ఆయన వరసగా గెలిచిన ఖాతాలో పడలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వరసగా రెండుసార్లు గెలిచింది. 2004, 2009లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పదేళ్ల పాటు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది.

వరసగా గెలుస్తూ...
ఇక 2014లో చంద్రబాబు బీజేపీతో పాత్తుపెట్టుకుని, జనసేన సహకారంతో బరిలోకి దిగి విజయం సాధించారు. తిరిగి 2019 ఎన్నికల్లో ఆయన ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీ గెలవడం సెంటిమెంట్ అని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబుకు మాత్రం ఒక్కసారి ఛాన్స్ ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలవాటుగా మారిందని, 2024 ఎన్నికల్లో తమదే విజయమని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు.
ఆ భయంతోనే...
నిజానికి చంద్రబాబులోనూ ఈ భయం ఉంది. 2004, 2009 ఎన్నికలే ఆయన గుర్తుకు వస్తున్నాయంటున్నారు. 2009లో టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలతో మహాకూటమిని కట్టినా చంద్రబాబు గెలవలేకపోయారు. ఈసారి కూటమి కట్టినా ఫలితం ఉంటుందా? లేదా? అన్న సందేహం ఆయనను వెంటాడుతుంది. అందుకే వరసగా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇసుకతో మొదలు పెట్టి క్యాసినో వరకూ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. గతానికి, ఇప్పటికీ టీడీపీ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఇంతకు ముందు ఉన్న సామాజికవర్గాల బలం టీడీపీ కోల్పోయింది.
మార్పు కోరుకుంటారని....
అయితే వచ్చే ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో టీడీపీ పరిస్థితి మెరుగుపడే అవకాశముందని చంద్రబాబు ఆశాభావంతో ఉన్నారు. ఇప్పుడే ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత ప్రారంభమయింది. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు 3.5 లక్షల మంది ఉంటారు. గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీకి ఓట్ల తేడా కేవలం ఐదు లక్షలు మాత్రమే. ఇక అమరావతి రాజధాని అంశం, పోలవరం, అభివృద్ధి లేకపోవడం, అద్వాన్న రహదారులు, ఇసుక కొరత వంటి అంశాలు మిగిలిన ఓట్లను తెచ్చి పెడతాయన్న అంచనాలో చంద్రబాబు ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా మార్పు కోరుకుంటారన్న ఆశతోనే చంద్రబాబు పార్టీని నెట్టుకొస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News