ఏడు పదుల ఎనర్జిటిక్ లీడర్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ప్రజల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు

Update: 2023-04-20 02:47 GMT

నారా చంద్రబాబు నాయుడు.. రాజకీయాల్లో ఆయన రికార్డులను ఎవరూ అధిగమించలేరు. ఇక భవిష‌్యత్ లోనూ కష్టమే. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, విభజన ఏపీలో ఐదేళ్లు సీఎంగా పనిచేశారు. అంటే దాదాపు పథ్నాలుగేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇక ప్రతిపక్ష నేతగా కూడా అదే రికార్డును కూడా నెలకొల్పారు. దాదాపు పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. నలభై ఏళ్ల పై నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఎత్తుపల్లాలు చూసినా, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా మనిషి అదరలేదు. బెదరలేదు. ఈరోజు చంద్రబాబు బర్త్ డే. తెలుగుపోస్ట్ ఆయనకు బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతుంది. ఆయన నేడు మార్కాపురంలో ప్రజల సమక్షంలో తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు.

ఎన్ని విమర్శలున్నా...
చంద్రబాబు రాజకీయంగా ఎదుగుదల ఊరికే వచ్చి ఆయన తలుపు తట్టలేదు. ఆయన ఒక మాట చెబుతుంటారు. సంక్షోభం నుంచే చంద్రబాబు సక్సెస్ వెతుక్కుంటారు. చంద్రబాబును కొందరు వెన్నుపోటు దారుడని, నయవంచకుడని ఎన్నైనా అనొచ్చు. కానీ రాజకీయాల్లో అలాగే ఉంటారు. పార్టీ కోసం, రాజకీయం కోసం, పార్టీని నమ్ముకున్న కార్యకర్తల కోసం అలా చేయడంలో తప్పు చేయలేదనే వారే అధికంగా ఉండబట్టే ఆయన పార్టీలలో తన స్థానాన్ని పదిలం చేసుకోగలిగారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఘటన ఆయన జీవితాంతం వెంటాడుతున్నా ఆయనను ప్రజలు ఆదరించడం వెనుక ఉద్దేశం అదే. నాడు చంద్రబాబు లేకపోతే పార్టీ మరింత భ్రష్టు పట్టిపోయేదని, ఆనాడే పార్టీని మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడేదని చాలామంది వాదిస్తారు. అందులో నిజం లేకపోలేదు.
కష్టాలెదురైనా...
ఎన్నో కష్టాలు.. ఎన్నో ప్రయాసలు.. తను సొంతం అనుకున్న వారే పార్టీని విడిచి వెళ్లిపోయినా ఆయన చలించలేదు. లోలోపల బాధపడినా అది క్యాడర్ కు కనపించకుండా దిగమింగుకుని రాజకీయం చేసిన నేత చంద్రబాబు. 2009లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు అయితే ఎందరో ముఖ్యులు పార్టీని వీడి వెళ్లారు. ఇక టీడీపీ పని అయిపోయినట్లేనని అనుకున్నారు. కానీ మొక్కవోని ధైర్యంతో పార్టీని నిలబట్టి.. తిరిగి అధికారంలోకి తెచ్చిన ఏకైక లీడర్ చంద్రబాబు అని చెప్పడంలో అతి శయోక్తి లేదు. 2014 ఎన్నికలలో నవ్యాంధ్ర ప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రికార్డు కూడా ఆయనే సొంతం. ఇలా రికార్డుల మీద రికార్డులు పొలిటికల్‌గా ఒక చంద్రబాబుకే సొంతం.
ఒక్కడే.. ఒంటరి పోరుతో...
గత నాలుగేళ్ల నుంచి పార్టీ నేతలు బయటకు రావడం లేదు. అయినా ఆయనఒక్కడే ఏడు పదుల వయసులో రాష్ట్రమంతటా తిరిగారు. క్యాడర్‌లో ధైర్యాన్ని నింపారు. నేతలను రోడ్లమీదకు తిరిగి తేగలిగారు. మహానాడు సక్సెస్ చేసి మళ్లీ పార్టీకి పునరుజ్జీవం పోశారు చంద్రబాబు. అదే ఇంకొకరయితే పార్టీని విడిచి వెళ్లేవారు. తనకున్న రికార్డులతో సంతృప్తి పడేవారు. కానీ చంద్రబాబు వ్యవహారం అలా కాదు. ఓపిక ఉన్నంత వరకూ తేల్చుకునే రకం. ఎందుకు సాధ్యం కాదని ఆయన నమ్మకమే బాబును ముందుకు నడిపిస్తుంది. చరిష్మా లేదు.. ప్రసంగాలు పసగా చేయలేరు. అయినా ఆయన ఎదిగారంటే ఆయనకు పరిపాలనపై ఉన్న పట్టుపైనే ప్రజలకు మక్కువ. దానినే ఆయన ఆయుధంగా చేసుకుని రాజకీయాల్లో రాజ్యమేలుతున్నారు.
సీన్ మార్చేసి...
ఇప్పటికీ ఆయన నాయకత్వంపై అందరి నమ్మకం. అందరి ఆశలు. అందుకే ఆయననే పార్టీ అధినేతగా ఇప్పటికీ పార్టీలో 90 శాతం మంది కోరుకుంటారు. అదీ ఆయన సమర్థత. పొత్తులు కుదర్చుకుని అధికారంలోకి వస్తారన్న అపప్రధను ఆయన ఎదుర్కొనవచ్చు. ఎవరికైనా పొత్తులు సహజమే. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లాంటివి కూడా కొన్ని రాష్ట్రాల్లో అవసరమైన సందర్భాల్లో పొత్తులు పెట్టుకుంటాయి. అలాంటి విమర్శలను చంద్రబాబు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ పట్టించుకోరు. ఏడు పదుల వయసులో నేటికీ ఆయన తిరిగినట్లు మరో రాజకీయ నేత తిరగడం లేదంటే పాలిటిక్స్ పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. మొన్నటి వరకూ ఏపీలో ఇక టీడీపీ ఖతం అన్న స్థాయి నుంచి రేపు టీడీపీదే అన్న స్థాయికి తీసుకువచ్చారంటే అది ఖచ్చితంగా చంద్రబాబు ఘనతే. 1950 ఏప్రిల్ 20న జన్మించిన చంద్రబాబు మరిన్న పుట్టిన రోజులు ప్రజల మధ్యనే జరుపుకోవాలని ఆశిద్దాం.


Tags:    

Similar News