ముందే అభ్యర్థుల లిస్ట్.. బాబు కసరత్తు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఎన్నికలను అంత సులువుగా తీసుకోవడం లేదు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఎన్నికలను అంత సులువుగా తీసుకోవడం లేదు. జగన్ ను పైకి తేలిగ్గా తీసుకుంటున్నట్లు కన్పిస్తున్నా లోలోపల అన్ని రకాలుగా మధనపడుతున్నారు. జగన్ కు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండదండలున్నాయి. తనకు 2019 ఎన్నికల మాదిరిగానే అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురు కావచ్చు. బీజేపీతో సయోధ్య కోసం తాను చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయన్న నమ్మకం చంద్రబాబుకు కూడా లేదు. అందుకే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బీజేపీ గుడ్ లుక్స్ లో
బీజేపీ గుడ్ లుక్స్ లో ఉండటానికి చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. అందుకే అడగకపోయినా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తనతో పొత్తు లేకపోయినా సరే.. ఆటంకాలు కల్పించకుండా ఉండేలా చూసుకునేందుకు చంద్రబాబు ముర్ముకు మద్దతు ప్రకటించారన్నది పొలిటికల్ కారిడార్ లో విన్పిస్తున్న టాక్. అయితే బీజేపీని పూర్తి స్థాయిలో నమ్మేందుకు కూడా చంద్రబాబు సిద్ధంగా లేరు. చివరి నిమిషంలో తన మిత్రుడిగా జగన్ భావించి సహాయసహకారాలు అందిస్తే తట్టుకోవడానికి ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.
ఆర్థిక వనరులు....
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేవలం ఆర్థిక వనరులను దెబ్బతీసే ప్రయత్నమే చేస్తుంది. తమ పార్టీ మద్దతుదారులపై ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో దాడులు చేస్తుంది. ఆర్థికంగా ఎన్నికలకు ముందు పార్టీని దిగ్భంధనం చేయగలుగుతుంది. అంతే తప్ప ప్రజల మనసులను మార్చలేదు. ప్రజలు తమ వైపు మొగ్గు చూపుతున్నారని చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారు. అందుకే బీజేపీతో కయ్యానికి దిగకుండా మంచిగానే ఉంటూ ఎన్నికలకు వెళ్లాలన్నది ఆయన యోచన.
70 నియోజకవర్గాల్లో...
అందుకే ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఆరు నెలలకు ముందుగానే 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాలని, పోరుకు సిద్ధం చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత చంద్రబాబు అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. కానీ ఈసారి మాత్రం ఎంపిక చేసుకున్న 70 నియోజకవర్గాల్లో ఆరు నెలలకు ముందు అభ్యర్థులను ప్రకటిస్తారు. వారికి ఏడాది ముందే సంకేతాలు ఇస్తారు. ఇలా కొంత పార్టీని ఆయా నియోజకవర్గాల్లో బలోపేతం చేసుకోవడంతో పాటు వారు ఆర్థిక వనరులు సమీకరించుకునేందుకు కూడా వీలు చిక్కుతుంది. అందుకే ఈసారి ఫస్ట్ లిస్ట్ ఆరు నెలల ముందే టీడీపీ అధినేత విడుదల చేయనున్నారని పార్టీ ఇన్నర్ వర్గాల టాక్.