బాబు వార్నింగ్... పరుగులు పెడుతున్న నేతలు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్లాన్ ఫలవంతమవుతుందనే చెప్పాలి. ఆయన అంచనాలు నిజమవుతున్నాయి. గ్రౌండ్ లో కన్పిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్లాన్ ఫలవంతమవుతుందనే చెప్పాలి. ఆయన అంచనాలు నిజమవుతున్నాయి. గ్రౌండ్ లో కన్పిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ బయటకు రాని నేతలు నేడు చంద్రబాబు కామెంట్స్ తో బయటకు వస్తున్నారు. ఒక రకంగా టీడీపీకి శుభపరిణామంగానే చెప్పాలి. గత కొద్దిరోజుల నుంచి చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ఫలితాలను సమీక్ష చేస్తున్నారు. ఎందుకీ సమీక్షలు అని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి.
సమీక్షలనే చంద్రబాబు....
అయితే ఈ సమీక్షలనే చంద్రబాబు పార్టీ బలోపేతానికి ఉపయోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బలమైన సంకేతాలను పంపారు. పార్టీలో పనిచేసిన వారికే టిక్కెట్లు అని చెప్పారు. అంతేకాదు రానున్న మూడేళ్లు నేతల పనితీరును గమనించిన తర్వాతనే టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని,చివరి నిమిషంలో వచ్చే వారికి నో ఛాన్స్ అని నిర్మొహమాటంగా చెప్పారు. పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేశారు.
గతంలో మాదిరి...
పార్టీ క్యాడర్ ను కాపాడుకోలేని నేతలు అనవసరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాగే పార్టీలో కోవర్టులను త్వరలో ఏరిపారేస్తానని కూడా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇదివరకటి చంద్రబాబును కాదని చెప్పకనే చెప్పారు. దీంతో టీడీపీ నేతల్లో చురుకు పుట్టినట్లుంది. ఇన్నాళ్లూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నేతలు తిరిగి యాక్టివ్ అయ్యారు. తమ స్థానాన్ని పదిలం చేసుకునేందుకు పరుగులు తీస్తున్నారు.
జలీల్ ఖాన్ వంటి వారు...
ఇందుకు ఉదాహరణ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. ఆయన గత ఎన్నికల్లో తన కుమార్తె ను టీడీపీ నుంచి పోటీ చేయించారు. ఓటమి పాలయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం టిక్కెట్ కోసం పోటీ పెరగడంతో రెండు రోజుల నుంచి యాక్టివ్ అయ్యారు. పార్టీ బలోపేతానికి తాను సై అంటున్నారు. అలాగే అనేక నియోజకవర్గాల్లో నేతలు యాక్టివ్ కావడానికి చంద్రబాబు వార్నింగ్ కారణమంటున్నా,రు. టీడీపీ కొంత పుంజుకోవడానికి చంద్రబాబు సీరియస్ నెస్ పనిచేసిందంటున్నారు.