వంగవీటి వ్యవహారం ఇలా తయారైందే?
కొడాలి నాని క్యాసినో పై తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధా మాత్రం స్పందించలేదు
వంగవీటి రాధా విషయంలో వస్తున్న అనుమానాలన్నీ నిజమేననిపిస్తుంది. ఆయన ఏ పార్టీకి దగ్గరగా ఉన్నారు? ఏ పార్టీకి దూరంగా ఉన్నారన్నది ఎవరికీ తెలియడం లేదు. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ నేతలకే అర్థం కావడం లేదు. ఆయనకు అన్ని పార్టీల నుంచి మిత్రులున్నప్పటికీ రాజీ పడిపోవడం రాధాకు అలవాటుగా మారిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.
హత్యకు రెక్కీ....
ఇటీవల వంగవీటి రాధా హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆయనే ఈ ఆరోపణలు చేశారు. తన వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా ఆయన ఇంటికి వచ్చి పరామర్శించారు. రాధా హత్యకు రెక్కీపై బాద్యులెవరో గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గన్ మెన్లను ఏర్పాటు చేసినా వంగవీటి రాధా తిరస్కరించారు. పోలీసులకు ఆధారాలివ్వాలన్నా ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. సమయం వచ్చినప్పుడు బయటపెడతానని రాధా చెబుతున్నారు.
కొడాలి క్యాసినో...
ఆరోజు వంగవీటి రాధా తనపై హత్యా జరిగిందన్న ఆరోపణలను మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమక్షంలోనే చేశారు. అయితే ఆ వ్యవహారంలో ఇప్పుడు ఎవరూ పెదవి విప్పడం లేదు. ఇక తాజాగా కొడాలి నాని గుడివాడలో క్యాసినో నిర్వహించారని టీడీపీ పెద్దయెత్తున ఉద్యమిస్తుంది. నిజనిర్ధారణ కమిటీ అక్కడకు వెళ్లి పర్యటించడానికి ప్రయత్నించింది. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి కూడా టీడీపీ రెడీ అవుతుంది.
గుడివాడకు దూరమేనా?
కానీ కొడాలి క్యాసినో పై వంగవీటి రాధా మాత్రం స్పందించలేదు. కరోనా సోకిన తర్వాత కొడాలి నానితో కలసి హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లి రాధా చేరి చికిత్స పొంది వచ్చారు. కొడాలి నాని వ్యవహారంపై తాను స్పందించనని చెప్పినట్లు తెలిసింది. అందుకే బొండా ఉమను పార్టీ రంగంలోకి దించిందంటున్నారు. మంత్రి కొడాలి నానికి పోటీగా గుడివాడలో వచ్చే ఎన్నికల్లో వంగవీటి రాధాను పోటీ చేయించాలని భావించారు. కానీ అది సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. రాధా ఇప్పుడు గుడివాడకు దూరంగా ఉన్నట్లే కనపడుతుంది. మొత్తం మీద వంగవీటి రాధా వ్యవహారం టీడీపీ అధినేత చంద్రబాబుకు మింగుడుపడని విధంగా ఉంది.