కోడెల కుటుంబానికి చెక్.. రీజన్ ఇదేనా?
కోడెల కుటుంబానికి టీడీపీ అధినాయకత్వం చెక్ పెట్టే ఆలోచనలు చేస్తుంది
కోడెల కుటుంబానికి టీడీపీ అధినాయకత్వం చెక్ పెట్టే ఆలోచనలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లిలో వైసీపీని ఎదుర్కొనాలంటే కోడెల శివరాం సరిపోడన్నది పార్టీ నేతల అంచనాగా వినిపిస్తుంది. స్పీకర్ గా పనిచేసిన కోడెల శివరాం ఆత్మహత్య చేసుకుని మరణించినా ఆయన కుమారుడి పట్ల కొద్దిగానైనా సెంటిమెంట్ సత్తెనపల్లిలో లేదని గ్రహించిన పార్టీ అధినాయకత్వం శివరాంను దూరం పెట్టాలన్న యోచనలో ఉన్నట్లు కనపడుతుంది. అందుకే కోడెల శివరాం వర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాధాన్యత తగ్గిస్తున్నారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు.
నాడు కోడెల అంటే...
పల్నాడు జిల్లాలో ఒకనాడు కోడెల కుటుంబం అంటే ఒక క్రేజ్. పల్నాడు పులిగా ఆయనకు పేరు. నరసారావుపేటలో వైద్యుడిగా కోడెల శివప్రసాదరావు అందరికీ సుపరిచితుడే. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన కోడెల ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. డాక్టర్ గా ఎంత సక్సెస్ అయ్యారో.. అంతకు మించి పొలిటీషియన్ గా విజయవంతమయ్యారు. 1983 నుంచి 1999 వరకూ వరసగా జరిగిన ఐదు ఎన్నికల్లోనూ నరసరావుపేట నుంచి కోడెల శివప్రసాదరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి దక్కేది. సీమలో పరిటాల, పల్నాడులో కోడెల క్రేజ్ ఉన్న నేతలుగా పార్టీలో గుర్తింపు ఉండేది.
సత్తెనపల్లిలో గెలిచినా...
2014 ఎన్నికల్లో నరసరావుపేట కాదని కోడెల శివరాంను తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లికి పంపింది. సత్తెనపల్లిలో ఆయన సొంత గ్రామం ఉండటంతో అక్కడ పోటీ చేయాలని ఆదేశించింది. 2014లో గెలిచిన కోడెల శివప్రసాద్ స్పీకర్ గా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికలలో తిరిగి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దానికి ప్రధాన కారణం కుటుంబ సభ్యుల అవినీతి, అక్రమాలేనన్న టాక్ ఉంది. కారణాలు తెలియదు కాని ఆయన హైదరాబాద్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. కోడెల స్పీకర్ గా ఉన్న సమయంలో గుంటూరు జిల్లాలోనూ, సత్తెనపల్లిలోనూ ఆయన కుమారుడు కోడెల శివరాంపై అనేక ఆరోపణలు వచ్చాయి. పార్టీ నేతలనే పట్టించుకునేవారు కాదని, కార్యకర్తలను కూడా దగ్గరకు తీయకుండా వ్యవహరించేవారని అంటారు.
మూడు వర్గాలు...
కోడెల శివప్రసాద్ మరణం తర్వాత సహజంగా ఆయన కుమారుడు కోడెల శివరాంకు పార్టీ పగ్గాలు అప్పగిస్తుంది. ఆత్మహత్య చేసుకున్నారని సెంటిమెంట్ పనిచేసి ఖచ్చితంగా టీడీపీకి సీటు దక్కుతుందని ఎవరైనా భావిస్తారు. కానీ కోడెల శివరాంకు సొంత పార్టీలోనే వ్యతిరేకత తీవ్రమయింది. అక్కడ మూడు గ్రూపులు తయారయ్యాయి. ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు చేపట్టడం సహజంగా మారిపోయింది. అందుకే ఇప్పటి వరకూ సత్తెనపల్లికి ఎవరినీ ఇన్‌ఛార్జి పదవిని చంద్రబాబు అప్పగించలేదు. ఇన్‌ఛార్జి పదవి ఖాళీ అయి మూడున్నరేళ్లవుతున్నా అక్కడ నియమించలేదంటే చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కోడెల కుటుంబం అంటే చంద్రబాబుకు గౌరవమే. కానీ అదే సమయంలో శివరాంకు టిక్కెట్ ఇస్తే గెలవడం కష్టమన్న నివేదికలు రావడంతో ఆయనను ఎంపిక చేయడానికి వెనకడుగు వేస్తున్నారు.
కోడెల వ్యతిరేక వర్గానికి....
తాజాగా కోడెల శివరాం వర్గానికి చెక్ పెడుతూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పల్నాడు ప్రాంత తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమైంది. పార్టీ పదవులను అధినాయకత్వం భర్తీ చేసింది. అందులో మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు వర్గానికే ఎక్కువ పదవులు దక్కాయి. దీంతో కోడెల శివరాంను పార్టీ హైకమాండ్ పొమ్మనకుండానే పొగపెడుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకే అని హైకమాండ్ చెబుతుంది. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి సీటు ఎవరికి దక్కుతుందో ఇప్పుడే చెప్పలేం. పొత్తులు ఉంటే... కుదిరితే.. మిత్రపక్షాలకు ఆ సీటు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. అందుకే చంద్రబాబు ఇన్‌ఛార్జి పదవిని ఇన్నాళ్లు భర్తీ చేయలేదనుకుంటున్నా, అక్కడ కోడెల శివరాం కు మాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. మరి శివరాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది పల్నాడు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.