జగన్ ఆ నిర్ణయం తీసుకుంటే?
ప్రభుత్వం పెరుగుతున్న అసంతృప్తి మరింత పెరగకముందే ఎన్నికలకు వెళ్లాలని జగన్ ఆలోచిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది
జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారా? అటువంటి సంకేతాలు కన్పిస్తున్నాయా? అంటే అవును విపక్షాలు మాత్రం ముందస్తు ఎన్నికలు వస్తున్నాయనే అభిప్రాయపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం రోజురోజుకూ పెరుగుతున్న అసంతృప్తి మరింత పెరగకముందే ఎన్నికలకు వెళ్లాలని జగన్ ఆలోచిస్తున్నారని, అందుకే ఎన్నికల వ్యూహకర్తగా రుషిరాజ్ సింగ్ ను నియమించుకున్నారంటున్నారు. ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఐప్యాక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రుషిరాజ్ సింగ్ ను జగన్ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారన్న టాక్ నడుస్తుంది.
రుషిరాజ్ సింగ్ ను....
ఇప్పటికే రుషిరాజ్ సింగ్ ఏపీలో తన ఐప్యాక్ టీంతో రంగంలోకి దిగారంటున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో ఐప్యాక్ టీం ఇప్పటికే జగన్ కు అందిస్తుంది. అసంతృప్తి ముదరకముందే ముందస్తు ఎన్నికలకు వెళితే మంచిదన్న సూచనలు అందాయంటున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దారుణమై సంక్షేమ పథకాల అమలుకు కూడా నిధులు ఉండవని భావిస్తున్న జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారన్న ప్రచారం అయితే జోరుగా సాగుతుంది.
వచ్చే ఏడాది మార్చి....
ఏడాది ముందుగానే ఎన్నికలకు వెళతారని విపక్షాలు కూడా రెడీ అవుతున్నాయి. ఈ ఏడాది డిసెంబరు నెలలో ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని, వచ్చే ఏడాది మార్చి నెలలో ఏపీలో ఎన్నికలు జరుగుతాయన్న టాక్ అయితే బలంగా విన్పిస్తుంది. పొరుగున ఉన్న తెలంగాణలో సయితం వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ లతో ఎన్నికలకు వెళ్లాలన్నది జగన్ ఆలోచనగా ఉందని చెబుతున్నారు. అందుకే గడప గడపకు ప్రభుత్వం పేరిట కొంత జనంలోకి పార్టీ నేతలు వెళ్లేలా జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించారంటున్నారు. ఎనిమిది నెలల సమయం వారికి ఇచ్చారంటున్నారు.
విపక్షాలు కూడా...
మరోవైపు విపక్షాలు కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయనే అంటున్నాయి. మార్చి 2023లో ఎన్నికలు జరుగుతాయని అందుకు సిద్దం కావాలని పార్టీ నేతలకు పిలుపునిస్తున్నారు. చంద్రబాబు జిల్లాల పర్యటన, పవన్ కల్యాణ్ బస్సు యాత్రలను ప్రారంభిస్తున్నారు. జగన్ కూడా త్వరలో జనం చెంతకు వెళ్లేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. ఇవన్నీ ముందస్తు ఎన్నికలకు సంకేతాలేనని అంటున్నారు. కానీ రెండేళ్లు ప్రభుత్వానికి సమయం ఉందని, పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు, ప్రజాసమస్యలను పరిష్కరించే వీలున్న సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదని పార్టీ సీనియర్ నేతలు కొట్టి పారేస్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.