సెంటిమెంట్ అంతేనట.. దేవగుడి ఫ్యామిలీకి దిగులే?
జమ్మలమడుగులో సెంటిమెంట్ ఉంది. ఒకసారి ఓడిపోతే వారు గెలుపు అందుకోవడం కష్టం
జమ్మలమడుగులో సెంటిమెంట్ ఉంది. ఒకసారి ఓడిపోతే వారు గెలుపు అందుకోవడం కష్టం. కానీ వరసగా గెలుపులు మాత్రం కొందరికే దక్కుతుంటాయి. జమ్మలమడుగు అసెంబ్లీ చరిత్రను తెలిసిన వారికి ఎవరికైనా ఇదే తెలుస్తోంది. జమ్మలమడుగులో దశాబ్దాల కాలాల నుంచి రెండు కుటుంబాలే శాసిస్తున్నాయి. ఒకటి పొన్నపురెడ్డి కుటుంబం. మరొకటి దేవగుడి కుటుంబం. ఈ రెండు కుటుంబాలే మొన్నటి వరకూ జమ్మలమడుగుకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాయి.
రెండు కుటుంబాలు....
2019 ఎన్నికల్లో తొలిసారి ఆ రెండు కుటుంబాలకు చెందని సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి గెలుపు కూడా తనదేనన్న ధీమాలో సుధీర్ రెడ్డి ఉన్నారు. పొన్నపురెడ్డి కుటుంబం 1983 నుంచి ఈ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తుంది. వారు తొలి నుంచి టీడీపీలోనే ఉన్నారు. పొన్నపురెడ్డి శివారెడ్డి, రామసుబ్బారెడ్డిలు వరసగా ఈ నియజకవర్గం నుంచి ఐదు సార్లు విజయం సాధించారు. ఈ కుటుంబానికి చివరి గెలుపు 1999 మాత్రమే.
ఒకసారి ఓడిపోతే...
ఇక దేవగుడి కుటుంబం కూడా అంతే. వీరి గెలుపు 2004లో ప్రారంభమయింది. దేవగుడి నారాయణరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా జమ్మలమడుగు నియోజకవర్గంలో పోటీ చేసి 2004, 2009లో గెలిచారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ విజయాన్ని ఆదినారాయణరెడ్డి సాధించారు. అయితే వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన టీడీపీలో చేరి మంత్రి పదవిని దక్కించుకున్నారు. తర్వాత 2019 లో కడప ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయిన తర్వాత బీజేపీలో చేరిపోయారు.
ఈసారి కూడా...
ఒకసారి విజయానికి బ్రేక్ పడితే ఇక గెలవలేరన్నది జమ్మలమడుగులో సెంటిమెంట్ గా మారింది. దేవగుడి కుటుంబానికి కూడా 2019 ఎన్నికల్లో బ్రేక్ పడటంతో వచ్చే ఎన్నికల్లో కూడా వారి గెలుపు అంత సులువు కాదు. ఆదినారాయణరెడ్డి బీజేపీలో ఉండగా ఆయన సోదరుడు నారాయణరెడ్డి కుమారుడు భూపేష్ రెడ్డి టీడీపీ ఇన్ ఛార్జిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కుటుంబంలో విభేదాలతో పాటు, వైసీపీలో పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఉండటం దేవగుడి కుటుంబానికి ఈసారి కూడా షాక్ తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. సెంటిమెంట్ అదే చెబుతుంది. లెక్కలు కూడా అలాగే అంటున్నాయి.