బిజినెస్ కాదు.. పాలిటిక్స్ లో కూడా అంతేనా?

కేశినేని నాని, చంద్రబాబుకు మధ్య బాగా గ్యాప్ వచ్చినట్లే కనపడుతుంది

Update: 2022-11-21 04:15 GMT

కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? విజయవాడ నుంచి పోటీ చేస్తారా? పోటీ చేస్తే ఏ పార్టీ నుంచి? తెలుగుదేశం పార్టీ నుంచా? లేక మరే ఇతర పార్టీల నుంచి బరిలోకి దిగుతారా? లేదా అసలు రాజకీయాలకే గుడ్ బై చెబుతారా? ఇవీ ప్రస్తుతం బెజవాడ టీడీపీ తమ్ముళ్ల మెదళ్లలో నానుతున్న ప్రశ్నలు. కేశినేని నాని ఏ నిర్ణయమైనా ఫాస్ట్ గా తీసుకుంటారు. అది ఆయన నైజం కావచ్చు. తానే మోనార్క్ అని అనుకుంటారు. తన క్రేజ్ వల్లనే రెండు సార్లు గెలిచానని భావిస్తారు. తనంటే జనానికి పిచ్చి అభిమానమని భ్రమిస్తారు. అందుకే ఆయన అప్పుడప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటారు.


ఆవేశంతోనే...

కేశినేని నాని తన ట్రావెల్స్ ను కూడా అలాంటి ఆవేశంతోనే మూసివేశారు. వేలాది మంది రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు రాజకీయంగా కూడా అంతే. రాజకీయంగా పదేళ్ల నుంచి ఆయన వెంట తిరిగిన అనుచరులకు కేశినేని నాని షాక్ ఇవ్వరన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు కేశినేని నాని మాత్రం టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు లేవనే చెప్పాలి. ఆయన పార్టీ హైకమాండ్ కు బాగా దూరమయ్యారు. అనేకంటే .. దూరం చేసుకున్నారు అనుకోవాలి. సహజంగా చంద్రబాబు లాంటి నాయకుడు బలమైన నేతను దూరం చేసుకోరు. ఆ ధైర్యమూ చేయరు.
అధినేతతో గ్యాప్...
కానీ నాని, చంద్రబాబుకు మధ్య బాగా గ్యాప్ వచ్చినట్లే కనపడుతుంది. చంద్రబాబు ఏ రాజకీయ నేతను తానొవ్వక, నొప్పింపక అన్న రీతిలో వ్యవహరిస్తారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే చంద్రబాబు పెత్తనం చెల్లాయిస్తారు తప్పించి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరినీ పోగొట్టుకోవాలని ఆయన కలలోనూ కోరుకోరు. అందుకే బుద్దా వెంకన్న, బోండా ఉమ వంటి వారిని దగ్గరకు తీసి ఉండవచ్చు. మరో కారణంగా కేశినేని శివనాధ్ అలియాస్ చిన్నిని కూడా ఆలింగనం చేసుకుని ఉండవచ్చు. పార్టీని ఆర్థికంగా ఆదుకుంటారని కారణం కావచ్చు. కానీ కేశినాని నాని మాత్రం తనను చంద్రబాబు దూరం పెడుతున్నారని భావించి పార్టీకి ఆయన మరింత దూరం అయ్యారు. భారంగా మారారు.

ఏ పార్టీ నుంచి....?
వచ్చే ఎన్నికల్లో కేశినేని నానికి టీడీపీ నుంచి టిక్కెట్ దక్కే అవకాశాలు తక్కువే. లోకేష్ కేశినేని చిన్నిని చేరదీయడంతో నానిని పూర్తిగా పక్కన పెట్టినట్లే. మరి కేశినేని నాని ఏ పార్టీలోకి వెళతారు? వైసీపీలోకి వెళ్లే అవకాశాలు తక్కువే. ఇక ఆయనకు మిగిలింది ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. బీజేపీ తరుపున పోటీ చేసినా బెజవాడ పార్లమెంటు నుంచి కేశినేని గెలుపు అంత సులువు కాదు. అక్కడ టీడీపీ, వైసీపీ బలంగా ఉన్నాయి. సామాజికవర్గం అండగా నిలుస్తుందనీ చెప్పలేం. కేశినేని పోటీ చేస్తే టీడీపీని దెబ్బతీయడానికి తప్పించి మరొకటి కాదు. అందుకే కేశినేని నాని గతంలో వ్యాపారం నుంచి తప్పుకుంటున్నట్లే ఇప్పుడు రాజకీయం నుంచి తప్పుకుంటున్నట్లే కనిపిస్తుంది. ట్రావెల్స్ ఉద్యోగులు లాగానే, ఆయనకు రాజకీయాల్లో వెన్నుదన్నుగా నిలిచిన వారు, వెంట తిరిగిన వారూ రోడ్డు మీద పడక తప్పదు.


Tags:    

Similar News