కసిగా కుప్పం టూర్.. టార్గెట్ అదేనా?

ఈసారి ఎలాగైనా కుప్పం నియోజకవర్గాన్ని గెలుచుకోవాలన్న పట్టుదలతో జగన్ ఉన్నారు.

Update: 2022-09-23 03:14 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈసారి ఎలాగైనా కుప్పం నియోజకవర్గాన్ని గెలుచుకోవాలన్న పట్టుదలతో జగన్ ఉన్నారు. అందుకే సంప్రదాయాలకు విరుద్ధంగా జగన్ కుప్పంలో నేడు అడుగుపెట్టబోతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి. కుప్పం నియోజకవర్గంలో జగన్ పర్యటన పార్టీకి ఎంత మేరకు ఉపయోగపడుతుందనేది భవిష్యత్ లో తేలనుంది. అయితే జగన్ లో కనిపిస్తున్న కసి చూస్తుంటే చంద్రబాబును కోటను బద్దలు కొట్టాలన్న ధోరణి కనపడుతుంది.

బాబుకు విజయమే తప్ప...
చంద్రబాబు కుప్పం నియోజజకవర్గంలో ఏడు సార్లు విజయం సాధించారు. ఇంతవరకూ ఆయనకు అక్కడ ఓటమి అనేది లేదు. గత ఎన్నికల్లో ఓట్లు తగ్గడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ విజయం సాధించడంతో జగన్ లో ఆశలు పెరిగాయి. ఆయన ముఖ్యమంత్రి కాకుండా శాసనసభలోకి అడుగు పెట్టబోనివ్వమని శపథం చేశారు. అలాంటిది ఆయనను అసెంబ్లీలో మనమే అడుగు పెట్టకుండా చేస్తే పోలా? అన్న శైలితోనే వైసీపీ అధినేత ఉన్నారనిపిస్తోంది. పార్టీ అగ్రనాయకులను ఓడించడం పెద్దకష్టమేమీ కాదు. గతంలో చరిత్ర చూసినా ఇదే చెబుతుంది.
చరిత్ర చూసుకున్నా...
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామరావుకు విశేష ఆదరణ ఉంది. ఆయన 1989లో కల్వకుర్తి నియోజకవర్గంలో పోట ీచేసి చిత్తరంజన్ దాస్ చేతిలో ఓటమిపాలయ్యారు. ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి సొంత నియోజకవర్గం పాలకొల్లులోనే ఓటమి పాలయ్యారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయారు. అంతెందుకు గాంధీ కుటుంబానికి పట్టున్న నియోజకవర్గం అమేధీ. అక్కడే ఆయన ఓటమిపాలు కావాల్సి వచ్చింది. ఇక పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో మమత బెనర్జీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. కాబట్టి గెలుపోటములు ఎవరి చేతులో ఉండవు. ప్రజలు నిర్ణయిస్తారు. గెలిస్తే చంద్రబాబు గెలవచ్చు. కానీ ఓటమి చెందలేరని కూడా చెప్పలేం.
అధికారిక కార్యక్రమే అయినా...
అదే ఇప్పుడు జగన్ లో ధైర్యాన్ని నింపింది. ప్రయత్నిస్తే పోయేదేంటి? అని జగన్ భావిస్తున్నట్లుంది. ప్రయత్నించడం అంటే ఆషామాషీగా కాదు. గట్టిగానే ట్రై చేస్తున్నారు. చంద్రబాబుకు ఇప్పటి వరకూ కుప్పం నియోజకవర్గంలో ఎదురులేదు. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో కుప్పం ఉంటుంది. ఇక్కడ బీసీలు ఎక్కువ. ఇన్నాళ్లూ చంద్రబాబు కూడా కొంత నిర్లక్ష్యం చేసినా జగన్ ఫోకస్ పెంచడంతో చంద్రబాబు కూడా ప్రతి మూడు నెలలకొకసారి కుప్పం పర్యటనకు వెళుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ప్రభుత్వ కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. వైఎస్సార్ చేయూత కింద నగదును లబ్దిదారులకు జగన్ అందచేస్తారు. అధికార కార్యక్రమే అయినప్పటికీ పార్టీ బలోపేతానికి కూడా జగన్ కుప్పం పర్యటన ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News