హస్తిన టూర్ .. ఫేట్ మారుతుందా?
ఈ సారి చంద్రబాబు ఢిల్లీ పర్యటన కీలకంగా మారబోతుందంటున్నారు. రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు
చంద్రబాబు ఢిల్లీ పయనమయి వెళ్లారు. చంద్రబాబుకు ఢిల్లీలో పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సారి చంద్రబాబు ఢిల్లీ పర్యటన కీలకంగా మారబోతుందంటున్నారు. రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన ప్రసంగాలు చప్పగా ఉన్నా, వ్యూహాలు మాత్రం రచించడంలో ఆయనకు ఆయనే సాటి.
గత ఎన్నికలకు ముందు...
అయితే గత కొన్నాళ్లుగా ఆయన వ్యూహాలు కూడా వర్క్ అవుట్ కావడం లేదు. కాలం చెల్లిన నిర్ణయాలు, గతంలో చేసిన తప్పిదాలు పార్టీకి పెద్దగా ఉపయోగపడటం లేదు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు వ్యూహం ఫలించలేదు. బీజేపీపై వ్యతిరేకత తనకు అనుకూలంగా మారుతుందని భావించారే తప్ప, రాష్ట్రంలో తనపై ఉన్న వ్యతిరేకతను తొలగించుకునే ప్రయత్నం చేయలేదు. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం వస్తుందని అంచనా వేశారు. కాంగ్రెస్ తో చేతులు కూడా కలిపారు. బీజేపీతో కయ్యానికి కాలు దువ్వుడంతో అన్ని కలసి పార్టీ పూర్తిగా పడకేయడానికి కారణాలుగా మారాయని చెప్పాలి.
పునరాలోచన...
అయితే 2019 ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. కేంద్రంలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని భావించిన చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలపై ఆయన చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ఆయనను దరి చేరనివ్వకుండా అడ్డుకుంటున్నాయి. బీజేపీకి కూడా ఇప్పుడు ఏపీలో కొన్ని సీట్లను సాధించడం అవసరమని చంద్రబాబు అంచనా. టీడీపీతో కలసి పోటీ చేసిన ప్రతిసారీ ఎంపీ స్థానాలను కమలనాధులను కైవసం చేసుకోవడాన్ని గుర్తు చేస్తున్నారు.
ఢిల్లీ పర్యటనలో...
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని టీడీపీ తొలి నుంచి డిమాండ్ చేస్తుంది. ఇప్పడు రాష్ట్ర బీజేపీ కూడా అదే బాటలో పయనిస్తుంది. పాదయాత్ర కూడా చేస్తుంది. కొంత రెండు పార్టీల మధ్య రాష్ట్ర స్థాయిలో అవగాహన వచ్చినట్లేనని అంటున్నారు. అయితే జాతీయ స్థాయిలో నేతల ఆలోచన ఎలా ఉందో తెలియడం కష్టంగా మారింది. అందుకోసం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉపయోగపడుతుందంటున్నారు. మోదీ, అమిత్ షాలను కలిసే అవకాశం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఆజాదీ కా అమృత్ ఉత్సవ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీ వెళుతున్నారు. ఈ సందర్భంగా వారిరువురిని కలవాలని ఆశిస్తున్నారు. వారిని కలిస్తే మాత్రం రాష్ట్రంలో ఈ రెండు పార్టీల కలయిక ఈజీ అవుతుందని రాష్ట్ర టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే జగన్ ను కాదని చంద్రబాబును తిరిగి తమ భుజాలపైకి ఎక్కించుకునేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం ఇష్టపడుతుందా? లేదా? అన్నది ఆసక్తికరమైన విషయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.