గంటా స్కెచ్ అదేనా?
జనసేన పార్టీకి ఈసారి కనీస స్థానాలను సాధించి కింగ్ మేకర్ గా నిలబెట్టాలన్నది గంటా శ్రీనివాసరావు ప్రయత్నంగా కన్పిస్తుంది
గంటా శ్రీనివాసరావు సీనియర్ రాజకీయ నేత. మంచి వ్యాపారవేత్త కూడా. ప్రకాశం జిల్లాలో పుట్టి విశాఖలో పారిశ్రామికంగా, రాజకీయంగా ఎదిగిన వ్యక్తి. ఆయన చూపంతా ఇప్పుడు పవన్ కల్యాణ్ పైనే ఫోకస్ ఉంది. జనసేన పార్టీకి ఈసారి కనీస స్థానాలను సాధించి కింగ్ మేకర్ గా నిలబెట్టాలన్నది గంటా శ్రీనివాసరావు ప్రయత్నంగా కన్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజికవర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చి చివరి క్షణంలో దానిని జనసేన వైపునకు టర్న్ చేయాలన్న లక్ష్యమే ఆయనలో కన్పిస్తుంది.
కూటమి కోసం....?
గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే పార్టీకి ఆయన రెండేళ్ల నుంచి దూరంగా ఉంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ ప్రయివేటీకరణకు నిరసనగా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు కనపడుతుంది. గత ఎన్నికల్లో ఏపీలో అత్యధికశాతం ఓట్లున్న కాపు సామాజికవర్గం వైసీపీకి వెన్నంటి నిలిచింది. దానిని జనసేన వైపు టర్న్ చేయాలన్నది గంటా శ్రీనివాసరావు ఆలోచనగా ఉంది.
కాపులకే సీఎం పదవి....
బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కాపు సామాజికవర్గానికి చెందిన నేత. అలాగే జనసేన ఎటూ కాపుల పార్టీయే. టీడీపీని ఇక్కడ గెలుపునకు ఉపయోగించుకోవాలని గంటా శ్రీనివాసరావు భావిస్తున్నారు. కూటమి అంటూ ఏర్పాటయితే ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా కాపులకు ఇవ్వాలన్న డిమాండ్ పెట్టనున్నట్లు తెలిసింది. టీడీపీ కూడా కాపులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటేనే పొత్తు కుదుర్చుకోవాలన్న కండిషన్ పెట్టనున్నారు.
బాబు ఒప్పుకుంటారా?
ఇటీవల రహస్యంగా జరిగిన కాపు నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. చంద్రబాబు మరోసారి జగన్ ను ముఖ్యమంత్రిగా కోరుకోరు. అలాగని ఆయన జగన్ ను ఓడించే పరిస్థితిలో లేరు. ఆయనకు పొత్తు అవసరం ఉంది. అందుకే కూటమి అధికారంలోకి వస్తే పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ ను ముందుకు తేనున్నారు. కాపు ఓటు బ్యాంకు కోసం, పార్టీల పొత్తుల కోసం చంద్రబాబు దిగివస్తారని గంటా శ్రీనివాసరావు నమ్మకంతో ఉన్నారు. అందుకే ఆయన తరచూ కాపు ముఖ్యనేతలతో సమావేశం అవుతున్నారు. మరి గంటా ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాల్సి ఉంది.