కేసీఆర్ మంత్రం అదే.. ఈసారి సెంటిమెంట్ కాదట
ఈసారి పశ్చిమ బెంగాల్ వ్యూహాన్ని తెలంగాణలో అమలుపర్చాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించుకున్నారని సమాచారం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికలకు తన వద్ద బ్రహ్మాండమైన మంత్రం ఉందని చెప్పారు. ప్రతి సారీ ఎన్నికల్లో సెంటిమెంట్ తో ప్రజలను దరిచేర్చుకునే కేసీఆర్ ఈసారి ఎలాంటి సెంటిమెంట్ తో ఎన్నికలకు వెళతారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రత్యర్థి పార్టీలు కూడా కేసీఆర్ వదలబోయే బ్రహ్మాస్త్రం ఏమై ఉంటుందన్న చర్చలు జరుపుతున్నాయి. కేసీఆర్ రాజకీయ దురంధరుడు. వ్యూహాలను రచించడంలో ఆయనకు మరెవ్వరూ సాటి రారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకున్నారు.
మమత ఎగ్జాంపుల్....
ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈసారి పశ్చిమ బెంగాల్ వ్యూహాన్ని తెలంగాణలో అమలుపర్చాలని నిర్ణయించుకున్నారని సమాచారం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మూడోసారి సునాయసంగా అధికారంలోకి వచ్చారు. ఇందుకు కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆమెపై వేధింపులకు దిగడమే. గవర్నర్ ద్వారా పాలనను అడ్డుకునే ప్రయత్నం చేయడమే. దీంతో మమతపై బెంగాలీల్లో సానుభూతి పెల్లుబుకింది. అదే ఆమె ఘన విజయానికి కారణమయింది.
బీజేపీ రెచ్చిపోతే....?
అదే తరహాలో కేసీఆర్ కూడా వెళ్లాలనుకుంటున్నట్లుంది. అందుకే ఎప్పుడూ లేనిది బీజేపీ పై కేసీఆర్ ఒంటి కాలు మీద లేస్తున్నారు. తొలి విడతలో బీజేపీతో సయోధ్యగా మెలిగిన కేసీఆర్ రెండో విడత మూడేళ్ల తర్వాత కయ్యానికి సిద్ధమయ్యారు. ఆ కయ్యం కూడా బీజేపీ నేతలను రెచ్చగొట్టే విధంగానే ఉంది. మోదీతో సహా ఎవరినీ వదిలిపెట్టకుండా కేసీఆర్ వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు. కేసీఆర్ కామెంట్స్ కు రెచ్చిపోయి బీజేపీ ఇక్కడ హడావిడి చేయాలి.
కావల్సిందదేగా?
కేసీఆర్ కు కూడా కావల్సిందదే. అందుకే ఇటీవల గవర్నర్ పాల్గొన్న రిపబ్లిక్ డే వేడుకలకు కూడా దూరంగా ఉన్నారు. గవర్నర్ ద్వారా బీజేపీ కవ్వింపు చర్యలకు పాల్పడాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. తద్వారా బీజీపీపై వ్యతిరేకతతో పాటు తనపై సానుభూతి వస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే బీజేపీని కేసీఆర్ ఇక తరచూ ఒక ఆటాడుకుంటారని చెబుతున్నారు. బీజేపీ రెచ్చి పోయే కొద్దీ ఇక్కడ టీఆర్ఎస్ మీటర్ పెరుగుతుంది. నిజానికి కేసీఆర్ ను తట్టుకోగలిగే స్థాయిలో బీజేపీ బలం ఇక్కడ లేదు. అయినా బీజేపీని టార్గెట్ చేయడం వెనక ఇదే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.