పొత్తులున్నా పట్టు దొరికేదెలా?

కొన్ని పార్లమెంటు స్థానాల్లోనైనా గెలిస్తే ఢిల్లీలో పట్టు దొరుకుతుంది. కానీ పవన్ కల్యాణ్ అటువంటి ప్రయత్నమే చేయడం లేదు.

Update: 2022-07-31 06:31 GMT

వచ్చే ఎన్నికల్లోనూ ఏ పార్టీకైనా పార్లమెంటు సీట్లు కీలకం. అవి ఉంటేనే ఢిల్లీలో కొంత గౌరవం లభిస్తుంది. పలకరించే వారుంటారు. లేకపోతే పట్టించుకునే వారే లేరు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో కాలు మోపలేకపోవడానికి మూడు సీట్లు రావడమే కారణం. అయితే జనసేన లాంటి పార్టీలకు కేంద్రం నుంచి సహకారం కావాలన్నా, ఢిల్లీ స్థాయిలో గుర్తింపు రావాలన్నా పార్లమెంటు స్థానాల్లో గెలుపు అవసరం. అయితే ఇప్పటి వరకూ జనసేన ఆ దిశగా దృష్టి పెట్టినట్లు కన్పించడం లేదు. కేవలం కొన్ని జిల్లాల్లోనే అదీ శాసనసభ నియోజకవర్గాలపైనే పవన్ ఫోకస్ పెట్టారు. అంతే తప్ప అసలు పార్లమెంటు స్థానాల గురించి పట్టించుకోవడం లేదు.

పార్లమెంటు స్థానాలను....
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కాని, టీడీపీతో కాని పొత్తు పెట్టుకోవాలనుకున్నా పార్లమెంటు స్థానాలకు సరైన అభ్యర్థులు అవసరం. కానీ ఆ దిశగా జనసేనాని ఆలోచించడం లేదు. ఇంకా రెండేళ్లు సమయం ఉందని పెద్దగా పట్టించుకోవడం లేదా? అసలు పార్లమెంటు నియోజకవర్గాలు తమకు అవసరం లేదా? అన్నది క్యాడర్ కు కూడా అర్థం కాకుండా ఉంది. సహజంగా పార్లమెంటుకు పోటీ చేసే నేతలు ఆర్థికంగా బలవంతులై ఉంటారు. రిజర్వడ్ నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్లమెంటు పరిధిలోని శానసనభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు అంతో ఇంతో ఆర్థికంగా ఆదుకోవాల్సి ఉంటుంది. ఏ పార్టీ కూడా పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులకు ఆర్థిక సహకారం అందించదు.
పొత్తులున్నా....
ఇక సామాజికవర్గం కూడా కొంత పనిచేస్తుంది. జనసేనకు కాకినాడ, అనకాపల్లి, నరసాపురం లాంటి రెండు మూడు మినహా మరెక్కడా అవకాశాలు కన్పించడం లేదు. ఒక వేళ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఈ మూడింటిలో నరసాపురం తప్ప మరెక్కడా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇవ్వదు. ఎందుకంటే దానికి కూడా ఎంపీలు అధిక స్థాయిలో గెలవడం అవసరం. ఇక రాజంపేట పార్లమెంటు పరిధిలో బలిజ సామాజికవర్గం బలంగా ఉంది. కానీ ఇప్పటికే అక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్త గంటా నరహరిని చంద్రబాబు ముందుగానే అభ్యర్థిగా ప్రకటించేశారు. రెండేళ్ల నుంచే ఆయన నియోజకవర్గాల్లో తిరిగి పార్టీకి ఖర్చు చేస్తాడన్నది చంద్రబాబు ఆలోచన. పార్టీ బలోపేతం కావడానికి కొంత ఉపయోగపడుతుంది.
అసలు అభ్యర్థులేరీ?
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములు పక్కన పెడితే, కనీసం కొన్ని పార్లమెంటు స్థానాల్లోనైనా గెలిస్తే ఢిల్లీలో పట్టు దొరుకుతుంది. కానీ పవన్ కల్యాణ్ అటువంటి ప్రయత్నమే చేయడం లేదు. ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థ జరిపిన సర్వేలోనూ జనసేనకు ఒక్క సీటు కూడా రాదని తేల్చింది. టీడీపీకి ఆరు, వైసీపీకి 19 స్థానాలు దక్కుతాయని సర్వే అంచనా వేసింది. సర్వే సంగతి పక్కన పెట్టినా మనోడు అసలు పార్లమెంటు నియోజకవర్గాలపై దృష్టి పెట్టిందెన్నడు? అన్న కామెంట్స్ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. బలమైన ఎంపీ అభ్యర్థులుంటేనే శాసనసభ అభ్యర్థులకు అన్ని రకాలుగా అందడండలు లభిస్తాయన్నది పవన్ విస్మరిస్తున్నారన్నది పార్టీ నుంచే వినిపిస్తున్న టాక్.


Tags:    

Similar News