4 నెలల్లో నలుగురు అగ్రనటుల్ని కోల్పోయిన టాలీవుడ్.. ఆ సంవత్సరంలోనూ ఇలాగే..
తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టి.. ఆ తర్వాత విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 777 సినిమాల్లో నటించిన నవరస నటనా..
టాలీవుడ్ ను వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగు నెలల కాలంలో నలుగురు దిగ్గజ నటుల్ని కోల్పోయి.. తీవ్రవిషాదంలో మునిగిపోయింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ, తాజాగా చలపతిరావు (78).. వీరంతా హఠాత్తుగా మరణించినవారే. నటుడు చలపతిరావు నేటి తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. 1966లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి సినిమాలో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన.. దాదాపు 1200కు పైగా సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు.
నాలుగు నెలల్లో నలుగురు అగ్రనటుల మరణాలు టాలీవుడ్ ను తీవ్రంగా కలచివేశాయి. తెలుగు సినీ పరిశ్రమలో రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన హీరో కృష్ణం రాజు (83) తీవ్ర అనారోగ్య సమస్యలతో ఓ ఆస్పత్రిలో చేరి.. సెప్టెంబర్ 11న తుదిశ్వాస విడిచారు. ఆ తర్వాత నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ అస్తమించారు. కృష్ణ కూడా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరి నవంబర్ 15న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఇద్దరి మరణాలు టాలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని నింపాయి.
తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టి.. ఆ తర్వాత విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 777 సినిమాల్లో నటించిన నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ (87) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. డిసెంబర్ 23 తెల్లవారుజామున ఆయన నివాసంలో కన్నుమూశారు. 24న మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కైకాల మరణం మిగిల్చిన విషాదం నుండి టాలీవుడ్ తేరుకోకముందే.. రెండ్రోజుల వ్యవధిలో నటుడు చలపతిరావు కన్నుమూయడంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. సరిగ్గా 2013లోనూ టాలీవుడ్ ను ఇలాంటి విషాదాలే వెంటాడాయి. నటుడు శ్రీహరి అక్టోబర్ 9, ధర్మవరపు సుబ్రమణ్యం డిసెంబర్ 7న, ఏవీఎస్ నవంబర్ 8న అనారోగ్య సమస్యలతో మృతి చెందారు.