వంటింట్లో ఇక టమాటా కనపడకపోవచ్చు.. ఈ ధరలతో కొనేదెలా ?

ఒకవైపు మండే ఎండలు, మరోవైపు అకాల వర్షాలు టమాటా ధర పెరుగుదలకు కారణమయ్యాయి. ఏపీలో కిలో టమాటా ధర రూ.80 వరకూ

Update: 2022-05-14 11:27 GMT

విజయవాడ : ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. అన్ని రేట్లు పెరుగుతున్నాయి కానీ.. సామాన్యుడి జీతం, కూలి మాత్రం పెరగడం లేదు. పెట్రోల్, డీజిల్, చికెన్ ధరలు ఇప్పటికే భారీగా పెరిగిపోయాయి. తాజాగా టమాటా ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. నెలరోజుల క్రితం కిలో టమాటా ధర రూ.8, రూ.5 పలుకగా.. ఇప్పుడు ఏకంగా రూ. 100 కి పైగానే చేరింది. గతేడాది నవంబర్లో భారీ వర్షాలకు టమాటా పంట నాశనమవ్వగా.. కిలో టమాటా ధర ఏకంగా రూ.120కి పైగా పలికింది.

ఒకవైపు మండే ఎండలు, మరోవైపు అకాల వర్షాలు టమాటా ధర పెరుగుదలకు కారణమయ్యాయి. ఏపీలో కిలో టమాటా ధర రూ.80 వరకూ పలుకుతుండగా.. తెలంగాణలో కిలో టమాటా ధర రూ.60 నుంచి రూ.100 వరకూ పలుకుతోంది. రానున్న రోజుల్లో కిలో టమాటా ధర రూ.120 వరకూ చేరవచ్చని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మళ్లీ కొత్తపంట వచ్చేంతవరకూ.. టమాటా ధరలు ఇలానే ఉండనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు చికెన్ ధర ట్రిపుల్ సెంచరీ దాటింది. తెలుగు రాష్ట్రాల్లో స్కిన్ లెస్ ధర రూ.320కి చేరగా.. విత్ స్కిన్ చికెన్ ధర రూ.280 నుంచి రూ.300 ఉంది. కరోనా తొలినాళ్లలో కిలో చికెన్ రూ.20 నుంచి రూ.50 లోపే పలికింది. అప్పట్నుంచి ఇప్పటి వరకూ చికెన్ ధరలు పెరుగుతూ వచ్చాయే తప్ప తగ్గిన దాఖలాలు ఎక్కడా లేవు. ఓ వైపు కూరగాయలు, మరోవైపు నిత్యావసరాలు, ఇంకోవైపు నాన్ వెజ్ ధరలూ భారీగా పెరిగిపోతుండటంతో.. మధ్యతరగతి కుటుంబాలు ఏం కొనాలో, ఏం తినాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నాయి.


Tags:    

Similar News