మునుగోడు గెలుపుతో నవ్వులే లేవా.. రీజనేంటి?
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వన్ సైడ్ విజయం దక్కాలి. పూర్తి స్థాయిలో మెజారిటీ రావాలి.
మునుగోడు ఉప ఎన్నికలు మాత్రం టీఆర్ఎస్ కు డేంజర్ సిగ్నల్స్ ఇచ్చాయి. ప్రత్యర్థి బీజేపీయా? కాంగ్రెస్? అన్నది కాదు ఇక్కడ. సాధారణ ఎన్నికలకు ముందు ఇంత టఫ్ ఫైట్ ను ఎదుర్కొనడం మాత్రం ఆషామాషీ కాదు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇరవై వేల ఓట్లకు పైగా మెజారిటీ వస్తుందని భావించినా పదివేలతోనే గులాబీ పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సహజంగా అధికార పార్టీకి ఉప ఎన్నిక అడ్వాంటేజీగా ఉంటుంది. సునాయాసంగా గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. పెద్దగా కష్టపడుకున్నా అభ్యర్థిని బట్టి కాకుండా అధికారంలో ఉన్న పార్టీవైపే ప్రజలు మొగ్గుచూపుతారు. అది వాస్తవం. కానీ ఇక్కడ అంత సులువు కాదు. ఇక పెద్దగా సమయం కూడా లేదు. మరికొద్ది నెలలు మాత్రమే సాధారణ ఎన్నికలకు సమయం ఉంది.
వన్ సైడ్ విజయం...
ఈ పరిస్థితుల్లో మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వన్ సైడ్ విజయం దక్కాలి. పూర్తి స్థాయిలో మెజారిటీ రావాలి. కాని ప్రతి రౌండ్ లో ఆపసోపాలు పడాల్సి వచ్చింది. అభ్యర్థి ఎంపికలో లోపమా? అధికార పార్టీ పట్ల వ్యతిరేకతా? అన్నది మాత్రం పార్టీలు విశ్లేషించుకోవాల్సిన ఎన్నిక ఇది. ఎందుకంటే కోమటిరెడ్డి బలమైన నేత కావచ్చు. ఎక్కువ సొమ్ములు పెట్టి ఉండవచ్చు. రేపు రానున్న సాధారణ ఎన్నికల్లో కోమటిరెడ్డి కాకుంటే ఇంకో నేత ఎవరైనా డబ్బులు పెట్టొచ్చు. ఇమేజ్ ను పెంచుకునే అవకాశం ఉండి ఉండవచ్చు. అప్పుడు ఇన్ని వ్యూహాలు అమలు చేయలేరు. ఇంత మందిని నియోజకవర్గాల్లో మొహరించలేరు.
వెల్‌ఫేర్ స్కీమ్స్...
అదే సమయంలో టీఆర్ఎస్ ధీమా తాము అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వర్క్ అవుట్ అవుతాయని కేసీఆర్ బలంగా భావించారు. రైతు బంధు నుంచి దళిత బంధు, పింఛన్లు వంటి వాటితో తమకు తిరుగులేదని అనుకుని ఉండవచ్చు. కాని తిరుగులేదు అనుకుంటే తిరగబడే అవకాశాలున్నాయని ఈ ఫలితాలు చెప్పకనే చెప్పాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో సంక్షేమ పథకాలు అనేది ఎందుకూ కొరగాకుండా పోయాయన్నది రాజకీయ విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్దిదారుల ఓట్లలో అధిక శాతం కారు గుర్తుపై పడలేదని చెబుతున్నారు. నిజంగా వెల్‌ఫేర్ స్కీమ్ లు వర్క్ అవుట్ కాలేదనే అనిపిస్తుంది. ఇన్‌స్టెంట్ గా ఇచ్చిన డబ్బులకే జనం నిలిచారన్నది కొందరి వాదన.
సెంటిమెంట్ కూడా...
అంతేకాకుండా మునుగోడు ఉప ఎన్నికలకు ముందే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కూడా వెలుగు చూసింది. చండూరులో జరిగిన సభలో నలుగురు ఎమ్మెల్యేలను కేసీఆర్ ప్రజల ముందు ఉంచారు. అయినా పెద్దగా మెజారిటీ రాలేదు. అంటే మునుగోడు ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ కూడా పెద్దగా పనిచేయలేదనే అనుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇటు సంక్షేమ కార్యక్రమాలు, అటు సెంటిమెంట్ మునుగోడులో పనిచేయలేదనే చెప్పాలి. ఇది ఖచ్చితంగా కేసీఆర్ కు డేంజర్ బెల్స్. మరోవైపు కాంగ్రెస్ 23 వేల ఓట్లు సాధించలేకపోయి ఉంటే టీఆర్ఎస్ కు ఇబ్బందులు ఎదురయ్యేవి. కాంగ్రెస్ బలహీనపడితే టీఆర్ఎస్ కు నష్టమన్న విషయానని గులాబీ పార్టీ నేతలు ఈ ఎన్నికతోతైనా గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పటికయినా ఆయన అభ్యర్థుల ఎంపికలోనూ, ఇతర ఎన్నికల వ్యూహాల్లోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుందన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి. మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినా కేసీఆర్ మనసులో మాత్రం కొంత అలజడి ప్రారంభమయిందనే అంటున్నారు.