వంగవీటి ఆలోచనల్లో మార్పు వచ్చిందా?
వంగవీటి రాధా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. పోటీ ఎక్కడి నుంచి అన్నది కాకుండా కాపుల్లో బలమైన నేతగా ఎదగాలనుకుంటున్నారు.
వంగవీటి రాధా వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఆయన పోటీ ఎక్కడి నుంచి చేస్తారన్నది పక్కన పెడితే కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. తాను కాపు సామాజికవర్గానికి బ్రాండ్ అంబాసిడర్ ని అని చెప్పుకునే పనిలో పడ్డారని చెప్పక తప్పదు. వంగవీటి రాధా వరసగా కాపు సామాజికవర్గం సమావేశాలకు హాజరవుతుండటమే ఇందుకు ఉదాహరణ. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన ప్రజల్లో ఉండేదుకు ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారని రంగా అభిమానుల్లో కూడా ఆనందం వ్యక్త మవుతుంది.
పట్టున్న నేతగా....
వంగవీటి రంగా తర్వాత కాపు సామాజికవర్గానికి ఏపీలో ముఖ్యమైన నేత కన్పించలేదు. ముద్రగడ పద్మనాభం ఒకింత ఆ సామాజికవర్గాన్ని ప్రభావం చేసే నేతగా కన్పించినా ఆయన మధ్యలో కాడి వదిలేయడంతో ఇప్పుడు ఆయనకు పట్టు లేదు. హరిరామ జోగయ్యను కాపులే ఓన్ చేసుకోవడం లేదు. పవన్ కల్యాణ్ వంటి నేతలు రాజకీయ అవసరాల కోసం కాపు ముద్ర పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా తాను ఆ సామాజికవర్గంలో పట్టున్న నేత అని నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు.
పార్టీయే ఇబ్బందా?
వంగవీటి రాధా కు పార్టీయే అడ్డంకి గా మారినట్లు కనపడుతుంది. తన తండ్రి వంగవీటి రంగాను హత్య చేసింది అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో కాబట్టి ఆ పార్టీ లో ఉంటే వంగవీటి రాధా కాపుల్లో మద్దతు దొరకడం కష్టంగానే కన్పిస్తుంది. రాధా ఇప్పటి వరకూ అనేక పార్టీలు మారినా పెద్దగా అభ్యంతరం పెట్టని కాపు నేతలు టీడీపీలో ఉండటాన్ని పరోక్షంగా తప్పు పడుతున్నారు. దీనిని గ్రహించిన వంగవీటి రాధా మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది.
టీడీపీలోనే ఉంటే....?
టీడీపీలో కూడా వంగవీటి రాధా సంతోషంగా లేరన్నది వాస్తవం. ఆ పార్టీ పరిస్థిితి బాగా లేకపోగా ఆ పార్టీ బీఫారంపై పోటీకి దిగితే మరోసారి ఓటమి తప్పదని వంగవీటి రాధా భయపడుతున్నారు. ఆయనకు ఇప్పుడు జనసేన తప్ప వేరే ఆప్షన్ లేదు. జనసేన అయితేనే తనను కాపు సామాజికవర్గం మరింత దగ్గరకు తీసుకుంటుందన్న భావనలో వంగవీటి రాధా ఉన్నారు. జనసేనలోకి జంప్ చేస్తే రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందన్న దానిపై వంగవీటి రాధా ముఖ్య అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు.