వంగవీటికి వైసీపీ బంపర్ ఆఫర్ ఇదేనా?

వంగవీటి రాధాకు మంచి ఛాన్స్ వచ్చిందంటారు. వైసీపీ నుంచి బంపర్ ఆఫర్ లభించిందంటారు.

Update: 2021-12-31 07:24 GMT

వంగవీటి రాధా ఎప్పుడూ అంతే. ఆయన సరైన నిర్ణయం తీసుకున్నారో? లేదో తెలియదు కాని ఎప్పడూ ఆయన అధికార పార్టీలో లేరు. 2004 లో మాత్రమే ఆయన అధికార పార్టీలో ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంగవీటి రాధాను ఇష్టపడే వారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వైఎస్ స్వయంగా వంగవీటి రాధాతో మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ లో ఉంటే భవిష్యత్ ఉంటుందని రాధాకు చెప్పినా వినలేదు.

ఒకటిన్నర దశాబ్దం నుంచి....
ఫలితంగా ఒకటిన్నర దశాబ్దం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేకపోయారు. అప్పటి నుంచి వంగవీటి రాధా అధికార పార్టీకి దూరంగానే ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేసిన తర్వాత రాధా వైసీపీలో చేరిపోయారు. 2014లో వైసీపీ అధికారంలోకి రాలేకపోయింది. దీంతో రాధా ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కానీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మల్లాది విష్ణును చేర్చుకోవడం, అదే నియోజకవర్గంలో గౌతమ్ రెడ్డికి ప్రాధాన్యత పెరగడంతో వంగవీటి రాధా 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిపోయారు.
లక్ లేక....
మరోసారి వంగవీటి రాధాకు బ్యాడ్ లక్ ఎదురయింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే అదే సమయంలో తన ప్రత్యర్ధిగా భావించే దేవినేని అవినాష్ అధికార పార్టీలో చేరిపోతూ ఎంతో కొంత లబ్ది పొందుతూ వస్తున్నారు. అవినాష్ 2014 తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయి తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీలో చేరిపోయారు. ఆయన తన అనుచరవర్గాన్ని కాపాడుకునేందుకు అధికార పార్టీని ఆశ్రయించక తప్పడం లేదంటారు.
వైసీపీ ఆఫర్....
ఇప్పుడు వంగవీటి రాధాకు మంచి ఛాన్స్ వచ్చిందంటారు. వైసీపీ నుంచి బంపర్ ఆఫర్ లభించిందంటారు. తమ పార్టీలోకి వస్తే వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ ఛాన్స్ ఇస్తామన్న ఆఫర్ వచ్చిందట. త్వరలో ఖాళీ అయ్యే వాటి నుంచే రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి వైసీపీ అధిష్టానం రెడీ అయిందట. మరి రాధా ఈ ఆఫర్ కు ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. వంగవీటి రాధా తీసుకునే నిర్ణయంపైనే ఆయన రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది. వైసీపీలోకి వెళతారా? టీడీపీలోనే కొనసాగుతారా? అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.


Tags:    

Similar News