వెంకయ్యే వద్దన్నారా?
ఉపరాష్ట్రపతిగా మరో టర్మ్ కంటిన్యూ అయ్యేందుకు వెంకయ్యనాయుడు ఇష్టపడలేదని తెలిసింది.
ఉపరాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. వచ్చే నెల 10వ తేదీతో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి పదవీకాలం ముగియనుంది. కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంది. ఉపరాష్ట్రపతిగా మరో టర్మ్ కంటిన్యూ అయ్యేందుకు వెంకయ్యనాయుడు ఇష్టపడలేదని తెలిసింది. ఆయన ఇదే విషయాన్ని తనను కలసిన బీజేపీ పెద్దలతో చెప్పినట్లు సమాచారం. అందుకే వెంకయ్య నాయుడు స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తుంది.
అందుకేనా?
వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఎందుకు కంటిన్యూ కావడం లేదనడానికి అనేక కారణాలు ఉండి ఉండవచ్చు. పెద్దల సభను డీల్ చేయడం అంత తేలిక కాదు. తన మనసును చంపుకుని కొన్ని నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంది. కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు కూడా. దీంతో పాటు ఉప రాష్ట్రపతి పదవి నుంచి ఎవరైనా ప్రమోషన్ కోరుకుంటారు. అంటే రాష్ట్రపతి కావాలనుకుంటారు. కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. వెంకయ్య విముఖతకు ఇది ఒక కారణంగా చూడాలి,
రిటైర్మెంట్ తీసుకోవాలని...
మరోవైపు తన రాజకీయ జీవితంలో వెంకయ్యనాయుడు ఎటువంటి మచ్చ లేకుండా గడిపారు. వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక తాను రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు. ఆయన ఈ పదవిలో ఉన్నంత కాలం అందరికీ దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రొటోకాల్ దృష్ట్యా ఆయన ఇబ్బంది పడుతున్నారు. అనేకసార్లు వెంకయ్య ఈ మాటలు అన్నారు. అందుకే మరోసారి ఉపరాష్ట్రపతిగా కొనసాగాలన్న బీజేపీ కేంద్ర నాయకత్వం కోరినా దానిని సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది.
వద్దని చెప్పడంతోనే..
అందుకే ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని బీజేపీ కేంద్ర నాయకత్వం ఎంపిక చేశారని చెబుతున్నారు. రాష్ట్రపతిగా ఎస్టీ అభ్యర్థి, ఉప రాష్ట్రపతిగా మైనారిటీ వర్గానికి చెందిన నఖ్వీని సెలెక్ట్ చేశారంటున్నారు. ఇటీవల నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలతో మైనారిటీ వర్గం దూరం కావడంతో నఖ్వీ ఎంపిక పార్టీకి అనివార్యమయిందని చెబుతున్నారు. అందుకే ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. రేపటితో నఖ్వీ రాజ్యసభ పదవీకాలం కూడా పూర్తి కానుంది. వెంకయ్య వద్దని చెప్పడంతోనే నఖ్వీ ఎంపిక జరిగిందన్నది ఢిల్లీ వర్గాల టాక్