ఎన్నికలైపోయినాక ఏమౌతుంది?...వాట్సప్‌ గ్రూపుల్లో తెగ చక్కర్లు కొడ్తున్నకవిత...మీకు తెలుసా

తెలంగాణ ఎన్నికలు దాదాపు పూర్తయ్యాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలు, సమర నినాదాలు, ఏడుపులు, పెడబొబ్బలు, శాపనార్ధాలు, సవాళ్లు, కొన్ని నిజాలు, ఎన్నో అబద్దాలతో గత ఆర్నెళ్లు తెలంగాణ ఓ రణ క్షేత్రాన్ని తలపించింది. నెల్లాళ్లుగా అందరి నోట్లో నానుతున్న అంశం ఎన్నికలే. ఇక ఎన్నికల తర్వాత ఎలా ఉంటుంది..? ప్రముఖ కవి, రచయిత దివంగత కె.ఎన్‌.వై.పతంజలి రాసిన కవిత ఒకటి ఉదయం నుంచి వాట్సప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది

Update: 2023-12-01 09:00 GMT

తెలంగాణ ఎన్నికలు దాదాపు పూర్తయ్యాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలు, సమర నినాదాలు, ఏడుపులు, పెడబొబ్బలు, శాపనార్ధాలు, సవాళ్లు, కొన్ని నిజాలు, ఎన్నో అబద్దాలతో గత ఆర్నెళ్లు తెలంగాణ ఓ రణ క్షేత్రాన్ని తలపించింది. నెల్లాళ్లుగా అందరి నోట్లో నానుతున్న అంశం ఎన్నికలే. ఇక ఎన్నికల తర్వాత ఎలా ఉంటుంది..? ప్రముఖ కవి, రచయిత దివంగత కె.ఎన్‌.వై.పతంజలి రాసిన కవిత ఒకటి ఉదయం నుంచి వాట్సప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. తెలుగు పోస్ట్‌ పాఠకుల కోసం ఆ కవిత యథాతథంగా అందిస్తున్నాం. మన దేశంలో ఏ రాష్ట్రంలోనైనా.. ఎన్నికల తర్వాత వాతావరణం ఇలానే ఉంటుంది.

ఎన్నికలైపోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది?

దగా పడిన ఆడకూతురిలా ఉంటుంది!

దొంగనవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా

రైలెక్కిపోయిన పల్లెటూరి పిచ్చి పిల్లలాగా ఉంటుంది దేశం.

ఎన్నికలైపోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది?

చిరిగిపోయిన ప్రచార పత్రాల గుట్టలాగుంటుంది.

మనకి భోజనం లేదని గుర్తుకొస్తుంది.

మనకి ఉపాధి లేదని, మనకి దిక్కూ,. దివాణం లేదని,

మనకి తెరువూ, తీరూ లేదని మళ్లీ గుర్తుకొస్తుంది.

మన ఇంట పుట్టిన దోమైనా, పరాయింట పుట్టిన జలగైనా

మన రక్తం పీల్చే బతుకుతాయని స్పష్టపడుతుంది.

తెలిసి తెలిసీ అయిదేళ్లక్ణోసారి జీవితాంతం

మోసపోవడం గూర్చి ఏడుపొస్తుంది.

మనమీద మనకి కొంచెం అసహ్యం వేస్తుంది.

మన బుద్ధి గడ్డి తింటున్నాదని తెలిసి సిగ్గేస్తుంది.

ఎన్నికల పతాకాలు విప్పేసిన తర్వాత, గుడారాలు పీకేసిన తర్వాత,

పట్టాభిషేక మహోత్సవం ముగిసిన తర్వాత

తుపాకీ ఇంకా మనకేసే గురిపెట్టి ఉందని తెలుస్తుంది.

మన ఓటే మనల్ని కాటేసిందని తెలుస్తుంది.

Tags:    

Similar News