ఆ ఐదు రోజులూ... ఏం జరగబోతోంది!

మరో తొమ్మిది నెలల్లో భారత లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 18 నుంచి 22 వరకు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. స్వాతంత్య్ర భారతంలో ఎన్నడూ లేని విధంగా మూడు అంశాలపై చర్చ జరుగుతుందని, చివరకు అవి మూడూ కూడా చట్ట రూపం దాలుస్తాయని మీడియా కోడై కూస్తోంది.

Update: 2023-09-04 03:11 GMT

మరో తొమ్మిది నెలల్లో భారత లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 18 నుంచి 22 వరకు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. స్వాతంత్య్ర భారతంలో ఎన్నడూ లేని విధంగా మూడు అంశాలపై చర్చ జరుగుతుందని, చివరకు అవి మూడూ కూడా చట్ట రూపం దాలుస్తాయని మీడియా కోడై కూస్తోంది.

అందులో ఒకటి మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌. ఈ అంశంపై ప్రాంతీయ పార్టీలైన రాష్ట్రీయ జనతాదళ్‌, సమాజ్‌వాదీ పార్టీ లాంటివి బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని పార్టీలు కప్పదాటు వైఖరిని ప్రకటిస్తున్నాయి. ప్రతీ అసెంబ్లీలో, పార్లమెంట్‌లో ముప్పయ్‌ మూడు శాతాన్ని మహిళలకు ఇవ్వడానికి ఏ పార్టీ కూడా సిద్ధంగా లేవు. కానీ బీజేపీ ఈ బ్రహ్మాస్త్రాన్ని వాడుకోడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ మహిళా బిల్లు కనుక పార్లమెంట్‌ ఆమోదం పొందితే, ఎన్నో ఏళ్లుగా పురుషాధిక్యత కింద నలిగిపోతున్న భారత మహిళ జీవితంలో అది పెను మార్పు అవుతుంది. చట్ట రూపం దాల్చగానే మహిళా సాధికారత సిద్ధిస్తుందని చెప్పడం హాస్యాస్పదం. ఎందుకంటే వార్డు మెంబర్‌ నుంచి మంత్రి వరకూ ఎదిగినా చాలా సందర్భాల్లో ఇంట్లో ఉన్న మగాళ్లదే డామినేషన్‌. కానీ ఓ దశాబ్దం తర్వాతైనా మహిళల జీవితాల్లో గణనీయమైన మార్పు వస్తుంది. ఇది తథ్యం.

రెండోది యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌(యూసీసీ). ఈ విషయంలో భాజపా, దాని తల్లివేరైన ఆరెస్సెస్‌ మొదట్నుంచీ పట్టుదలగానే ఉన్నాయి. రాజ్యాంగం దేశవాసులందరికీ ఒక్కటే అయినప్పుడు వివాహ చట్టాలు కూడా వేర్వేరుగా ఉండకూడదనేది ఆరెస్సెస్‌ వాదన. ముఖ్యంగా ముస్లింలలో బహు భార్యాత్వం ఉంటుంది. అలాగే ‘తలాక్‌’ చెప్పి... విడిపోవడం కూడా చాలా సులువు. తలాక్‌ పద్ధతిని సుప్రీం కోర్టు నిషేధించినా, భాజపా కూడా యూసీసీ వైపే మొగ్గు చూపుతోంది. 21 లా కమిషన్‌ మన దేశానికి యూసీసీ అవసరం లేదని చెప్పినా... బీజేపీ ‘ఆ విధంగా’ ముందుకు పోతోంది. యూసీసీ వల్ల హిందువులకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రక్త సంబంధీకుల మధ్య వివాహాలు (మేనరికం లాంటివి) శాస్త్రీయమైనవి కాదు. చట్టం శాస్త్రీయతకే పెద్ద పీట వేస్తే హిందువులకు కూడా ఇబ్బందులు తప్పవు.

మూడోది జమిలి ఎన్నికలు. ఒకే దేశం`ఒకే ఎన్నికలు అంశాన్ని చర్చించేందుకు ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అందులో ఎక్కువమంది భాజపా సభ్యులే ఉండటంతో కమిటీ నిర్ణయం ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఇలాంటి కమిటీలో సభ్యునిగా ఉండలేనని కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరి ఇప్పటికే ప్రకటించారు. రాబోయే తొమ్మిది నెలల్లో దాదాపు పార్లమెంట్‌తో సహా పది రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్లనున్నాయి. మరో రెండున్నరేళ్లలో మరో పదిహేను రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జమిలి ఎన్నికలకు వెళ్లడం వల్ల చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సగంలోనే తమ పదవీకాలాన్ని ముగించుకోవాల్సి ఉంటుంది. ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుంది. మరి ఈ చిక్కు ముడిని భాజపా ఎలా విప్పుతుందో చూడాలి.

యుద్ధ ప్రాతిపదికన బిల్లులు ప్రవేశపెట్టడం.. ఒకట్రెండు రోజుల్లో వాటిని చట్టాలుగా మార్చడం భాజపా ప్రభుత్వానికి కొత్త కాదు. ఐదేళ్ళ కిందట.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి పది శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు రెండ్రోజుల్లో చట్టరూపం దాల్చింది. 370వ అధికరణం రద్దు కూడా రెండ్రోజుల్లోనే తేలిపోయింది. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలని, మెజార్టీ ఉన్పప్పుడే సంఫ్‌ు లక్ష్యాలు సాధించాలని మోదీ, షా ద్వయం భావిస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ పర్యవసానాలను భవిష్యత్తే తేల్చి చెప్పాలి.

Tags:    

Similar News