రుయా ఘటనపై పవన్ కళ్యాణ్ సూచనలను ఏపీ ప్రభుత్వం పట్టించుకుంటుందా..?

కడప జిల్లా చిట్వేలుకు చెందిన నరసింహ కుమారుడు జసవ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ రుయా ఆసుపత్రిలో చనిపోయాడని..

Update: 2022-04-27 04:04 GMT

తిరుపతి : రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతి చెందగా, అంబులెన్స్ సిబ్బంది రూ.10 వేలు డిమాండ్ చేయడంతో.. ఆ తండ్రి కొడుకు మృతదేహాన్ని బైక్ పై 90 కిమీ తీసుకెళ్లాల్సి వచ్చింది. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ సమకూర్చాలని ఆ బాలుడి తండ్రి అధికార వర్గాలను వేడుకున్నా ఫలితం లేకపోయిందని వాపోయారు. తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవ‌ర్లు సాగించిన దందాపై ఏపీ ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా స్పందించింది. మంత్రి రోజా మాట్లాడుతూ.. ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులుగా గుర్తిస్తూ ఆసుప‌త్రి సీఎస్ఆర్ఎంవోను స‌స్పెండ్ చేశామ‌ని రోజా ప్ర‌క‌టించారు. అంతేకాకుండా ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశామ‌ని ఆమె తెలిపారు.

వైద్యం చేయాలా? అంబులెన్సులు పురమాయించాలా ?
ఈ ఘటనపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. కడప జిల్లా చిట్వేలుకు చెందిన నరసింహ కుమారుడు జసవ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ రుయా ఆసుపత్రిలో చనిపోయాడని వెల్లడించారు. తండ్రి నరసింహ తన బిడ్డ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి పడిన కష్టం, వేదన చూశానని తెలిపారు. ప్రైవేటు అంబులెన్స్ ఆపరేటర్లు అడిగినంత డబ్బు ఇవ్వలేక, చనిపోయిన తొమ్మిదేళ్ల కొడుకును భుజంపై వేసుకుని 90 కిలోమీటర్లు బైక్ మీద వెళ్లిన ఘటన కలచివేసిందని తెలిపారు. ఈ ఘటనకు విధుల్లో ఉన్న ఓ వైద్యుడ్ని సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని, డ్యూటీలో ఉన్న డాక్టర్లు వైద్యం చేయాలా? లేక అంబులెన్సులు పురమాయించాలా? అని జనసేనాని ప్రశ్నించారు.
ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ విభాగాన్ని పటిష్టం చేయకపోవడంవల్లే ఇలాంటివి జరుగుతున్నాయని.. ఈ ఒక్క ఘటనే కాదని, రుయా ఆసుపత్రిలో కరోనా వేళ ఆక్సిజన్ కొరతతో 30 మంది మరణించారని పవన్ గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరమైన మౌలిక సదుపాయాల కొరత గురించి నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రి డాక్టర్ సుధాకర్ మాట్లాడితే అతడిని వేధించారని పవన్ ఆరోపించారు. ఆ వేదనతోనే సదరు డాక్టర్ చనిపోయారని వెల్లడించారు. ఈ సంఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపిస్తున్నాయని విమర్శించారు. కన్నవారి కడుపు కోత అర్థం చేసుకోలేని స్థితికి ఆసుపత్రుల చుట్టూ ఉండే మాఫియాలు తయారయ్యాయని అన్నారు. ఇలాంటి వాటికి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.


Tags:    

Similar News