చంద్రన్నతో యార్లగడ్డ భేటీ.. మరి దుట్టా రామచంద్రరావు దారెటు?
ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. యార్లగడ్డ ..
ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రస్తుతం యార్లగడ్డ వెంకట్రావు అంశం ఏపీ రాజకీయాల్లో వాడివేడిగా కొనసాగుతోంది. యార్లగడ్డ వెంకట్రరావు చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ భేటీలో యార్లగడ్డకు సన్నహితంగా ఉండే దుట్టా రామచంద్రరావు దారి ఎటువైపు అన్న అంశంపై చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే దుట్టా అనుచరులు యార్లగడ్డ వెంటే ఉన్నారు. దుట్టా రామచంద్రరావు మాత్రం ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నారు. వైసీపీలోనే కొనసాగుతారనే టాక్ వినిపిస్తోంది. అయితే దుట్టా మాత్రం పార్టీ మార్పుపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
గన్నరవరంలో యార్లగడ్డ తన అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం రాజకీయంగా బలప్రదర్శకు దారి తీసే వేదికగా మారింది. గత ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత జరిగిన పరిణామాలను కార్యకర్తల సమావేశంలో ప్రస్తావించారు. తమను ఓడించిన వ్యక్తితోనే సంధి ఏంటంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తీవ్ర విమర్శలు చేశారు. అదే సమావేశంలో చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇస్తే కలుస్తానన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం నాడు యార్లగడ్డ వెంకట్రావు చంద్రబాబును హైదరాబాద్‌లో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే యార్లగడ్డ మాత్రం టీడీపీలో చేరుతారన్న అంశం ఖరారైంది. ఈ నెల 22న నారా లోకేష్ సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
గత ఎన్నికల్లో తనపై గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలో చేరడంతో యార్లగడ్డకు నియోజకవర్గంలో మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఓటమి పాలైన తర్వాత ఆయనకు కేడీసీసీ చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు కేవలం 990 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఆ తర్వాత వల్లభనేని టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లడంతో ఆ నియోజకవర్గంలో పరిస్థితి యార్లగడ్డ వర్సెస్ వల్లభనేనిగా మారింది.
వంశీ రాకతో ఒక్కటైన యార్లగట్ట-దుట్టా..
వంశీ రాకను వ్యతిరేకిస్తూ.. యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు ఒక్కటైపోయారు. దుట్టా రామచంద్రరావు యార్లగడ్డకు వెనక ఉండి మద్దతు ఇచ్చారు. ఆత్మీ సమావేశంలో దుట్టాకు కూడా వైసీపీ అన్యాయం చేసిందంటూ యార్లగడ్డ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆత్మీయ సమావేశానికి ముందు దుట్టాతో పలుమార్లు భేటీ అయ్యారు యార్లగడ్డ. ఈ నేపథ్యంలోనే యార్లగడ్డ టీడీపీ గూటికి వెళ్తున్న నేపథ్యంలో దుట్టా రామచంద్ర కూడా ఆయనతో పాటే సైకిల్ పార్టీలోకి వెళ్తారా..? లేదా అనేది ఆసక్తికరంగా ఉంది. అయితే సమయం వచ్చినప్పుడు తన నిర్ణయం చెబుతానంటూ బదులిచ్చాడు రామచంద్ర. దీంతో సైకిల్ పార్టీలో దుట్టా చేరికపై కాస్త సందిగ్దం నెలకొంది.