సెగ మామూలుగా లేదుగా
వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతుంది..
వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తీవ్రమైన వ్యతిరేకత బయటపడుతుండటంతో ఎమ్మెల్యే గ్రామాల్లో కూడా పర్యటించలేకపోతున్నారు. తాడికొండ నియోజకవర్గం వైసీపీ హైకమాండ్ కు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. తమపైనే కేసులు పెట్టించారంటూ ఉండవల్లి శ్రీదేవిపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ హైకమాండ్ పార్టీ అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియమించారు. అది కూడా అప్పట్లో రచ్చ అయింది. దీంతో డొక్కా మాణిక్యవరప్రసాద్ కొంత సైలెంట్ అయ్యారు.
తొలి నుంచి వ్యతిరేకతే...
నిజానికి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై తొలి నుంచి వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. ఆమె స్వతహాగా వైద్యురాలు. హైదరాబాద్ లో వైద్య వృత్తి చేసుకుంటున్న ఉండవల్లి శ్రీదేవిని తాడికొండ టిక్కెట్ ఇచ్చి జగన్ గెలిపించారు. కానీ ఆమె డాక్టర్ గా సక్సెస్ అయినా పొలిటిషియన్ గా మాత్రం ఫెయిల్ అయ్యారన్న విమర్శలున్నాయి. తొలినుంచి తాడికొండలో తన కంటూ ప్రత్యేకమైన గ్రూపును ఏర్పాటు చేసుకోవడంతో వైసీపీ సిసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు. తాడికొండ పంచాయతీ అనేక సార్లు హైకమాండ్ దృష్టికి వెళ్లినా ఫలితం కన్పించలేదు.
మూడు గ్రూపులు...
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కు పొసగదు. అలాగే పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ కు, ఉండవల్లి శ్రీదేవికి మధ్య విభేదాలున్నాయి. తాడికొండ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అందులో డొక్కామాణిక్య వరప్రసాద్, నందిగం సురేష్ లు కూడా ఉన్నారు. వీరిద్దరి వర్గాలు కూడా తాడికొండలో ఉన్నాయి. నందిగం సురేష్ ది అదే ప్రాంతం కావడంతో తాను ఈసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడేపల్లి వైసీపీలో గ్రూపు విభేదాలు భగ్గుమంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ ఉండవల్లి శ్రీదేవికి ఇస్తే తాము సహకరించబోనని వైసీపీ కార్యకర్తలు బహిరంగంగానే చెబుతున్నారు.
మధ్యలో వెళ్లిపోయిన...
తాజాగా తాడికొండ, తుళ్లూరు మండలాలకు చెందిన వైసీీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీదేవి మాట్లాడుతున్న సమయంలో కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. శ్రీదేవి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వచ్చిన ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మర్రి రాజశేఖర్ లు సర్దిచెప్పినా కార్యకర్తలు వినిపించుకోలేదు. సభలో కుర్చీలు విసిరేయడంతో శ్రీదేవి ప్రసంగించకుండానే వెళ్లిపోయారు. చివరకు పోలీసులు కలగచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మర్రి రాజశేఖర్ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చినా వారు శాంతించలేదు. శ్రీదేవి ఇక్కడ నుంచి వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. కార్యకర్తల సమస్యలను తెలుసుకునేందుకు పార్టీ హైకమాండ్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఉండవల్లి శ్రీదేవికి సొంత పార్టీ నుంచి సెగ మామూలుగా తగలలేదు.