ఇద్దరివీ భ్రమలే... చిల్లర పోరు ఆగేదెలా?
జగన్ భ్రమల్లో మునిగి తేలుతున్నారు. 30 ఏళ్లు అధికారం తనదేనని వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీని లెక్క చేయడం లేదు
అవును జగన్ భ్రమల్లో మునిగి తేలుతున్నారు. ముప్ఫయేళ్లు తనదే అధికారం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీని అసలు లెక్క చేయడం లేదు. ప్రొటోకాల్ ను పాటించడం లేదు. విపక్ష నేతలపై కేసులు నమోదు చేయడంతో పాటు ప్రశ్నించిన వారిని బొక్కలో తోసేస్తున్నారు. జగన్ కు ఇది మరో రెండేళ్లు నడుస్తుంది. అధికారంలో ఉన్నంత వరకూ వారిని ఇబ్బంది పెట్టవచ్చు. వారిపై ప్రతీకారం తీర్చుకోవచ్చు. కానీ వచ్చే ఎన్నికల తర్వాత ఫలితాలు తారుమారైతే పరిస్థితి ఏంటన్నది ఆయన ఆలోచించడం లేదు. అదే పరిస్థితి భవిష్యత్ లో తనకు, తన పార్టీకి ఎదురుకాబోదన్న ఆలోచనే లేదు.
వచ్చే ఎన్నికల్లో...
వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలయినా ప్రతిపక్ష నేతగా తన జోలికి ఎవరూ రారు. కానీ ఇబ్బంది పడేది నేతలు, కార్యకర్తలు మాత్రమేనని జగన్ గుర్తుంచుకోవడం లేదు. చంద్రబాబు కూడా తక్కువేమీ కాదు. తాను అధికారంలో ఉండగా శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలను మాట్లాడే ప్రయత్నం చేసినా గొంతు నొక్కేవారు. రోజా వంటి వారిపై కేసులు కూడా పెట్టారు. జగన ను విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి వెనక్కు పంపారు. ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు. చంద్రబాబుకు ఏం పరవాలేదు. ఆయన జోలికి ఎవరూ వెళ్లడం లేదు. కానీ ఇబ్బంది పడుతుంది కార్యకర్తలు, పార్టీ నేతలే.
గ్యారంటీ ఏమైనా ఉందా?
జగన్ కూడా అదే దారిలో పయనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న గ్యారంటీ ఎవరికీ లేదు. ఎందుకంటే ప్రజానాడి ఎటువైపు ఉంటుందో చెప్పలేం. మార్పు కోరుకుంటే జగన్ విపక్ష నేతగా ఉండాల్సిందే. మరోసారి అవకాశమిస్తే సరేసరి. కానీ విపక్ష నేతగా వస్తే ఇబ్బంది పడేది కార్యకర్తలేనన్న విషయాన్ని వైసీపీ పెద్దలు విస్మరిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు ఇదే భ్రమలో ఉన్నారు. జగన్ ను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఆదరించరని, రాష్ట్రానికి తానే దిక్కన్న ధోరణితో అహంభావంగా వ్యవహరించారు. తన వద్దకు వచ్చిన అనేక మందిని దూషించిన సంఘటనలు కూడా చూశాం.
అన్ని రోజులూ...
కానీ అన్ని రోజులూ మనవే కావు. ఒకేలా ఉండవు. రాజకీయాలన్నాక పరస్పరం గౌరవించుకుంటేనే పార్టీకి భవిష్యత్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. కక్షలు, సాధింపులు, కేసులే ఎక్కువగా కన్పిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే బదులుకు బదులు తీర్చుకుంటామని చెబుతున్నారు చంద్రబాబు. ఖబడ్దార్ అంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. జనం కూడా విసిగెత్తి పోతున్నారు. సమస్యలను చెప్పుకునే వీలులేదు. ప్రశ్నిస్తే పోలీసు వాహనాలు ఇంటికి వస్తున్నాయి. కేసులు జగన్ అయినా, చంద్రబాబు అయినా అధికారంలో ఉన్నప్పుడు సమన్వయంతో వ్యవహరించాలి. ఒకరినొకరు గౌరవించుకుంటే రాజకీయాలు హుందాగా నడుస్తాయి. లేకుంటే చిల్లర రాజకీయాలుగా మారతాయి. ఇప్పటికే ఏపీలో రెండో దశ ప్రారంభమయిందనే చెప్పాలి. మరి దీనికి ఇప్పటికైనా జగన్ ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.