డేటా చోరీపై వైఎస్ జగన్ సీరియస్ కామెంట్స్..!

ప్రజల వ్యక్తిగత వివరాలను దొంగతనం చేసిన చంద్రబాబుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసే అర్హత ఉందా అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. మంగళవారం నెల్లూరులో జరిగిన [more]

Update: 2019-03-05 10:41 GMT

ప్రజల వ్యక్తిగత వివరాలను దొంగతనం చేసిన చంద్రబాబుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసే అర్హత ఉందా అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. మంగళవారం నెల్లూరులో జరిగిన సమర శంఖారావం సభలో జగన్ మాట్లాడుతూ… ప్రజల డేటాను దొంగతనం చేసి పట్టుబడ్డ చంద్రబాబు మళ్లీ ఆయన దొంగ దొంగ అని అరుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వద్ద భద్రంగా ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత వివరాలు టీడీపీకి చెందిన బినామీ కంపెనీల వద్ద ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమంటే సెల్ ఫోన్ కనిపెట్టా, హైదరాబాద్ కట్టా, డేటా నా సొత్తు అని చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇంత జరిగినా చంద్రబాబును యెల్లో మీడియా వెనకేసుకొస్తుందన్నారు. డేటా చోరీపై తెలంగాణ పోలీసులు విచారణ చేస్తుంటే వెంటనే ఏపీ పోలీసులను అడ్డుకోవడానికి పంపించారని అన్నారు. ఏపీ పోలీసులను చంద్రబాబు తన వాచ్ మెన్లుగా వాడుకుంటున్నారని ఆరోపించారు.

పట్టుబడినప్పుడల్లా అవే మాటలు…

దొంగ ఓట్లను చేర్చి, వైసీపీ ఓట్లను చంద్రబాబు తొలగిస్తుంటే ఎన్నికల సంఘానికి తాము ఫిర్యాదు చేయడమే తప్పు అని చంద్రబాబు అంటున్నారని అన్నారు. మళ్లీ యెల్లో మీడియాతో కలిసి చంద్రబాబు మాపైనే ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఓటుకు కోట్లు ఇస్తూ పట్టుబడ్డప్పుడు కూడా చంద్రబాబు సెక్షన్ 8, ఉమ్మడి రాజధాని, ఏపీపై దాడి అన్నారని, మళ్లీ ఇప్పుడు కూడా పట్టుబడి ఇవే మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. టీడీపీ వారు కాదు అనుకుంటే రేషన్ కార్డులు, పింఛన్లు తీసేసిన చంద్రబాబు ఇప్పుడు ఓట్లు కూడా తీసేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు దోచుకుంటుంటే గ్రామాల్లో జన్మభూమి కమిటీలు దోచుకుంటున్నాయని అన్నారు. నాలుగేళ్లు బీజేపీ, వపన్ కళ్యాణ్ తో దోస్తీ చేసిన చంద్రబాబు ఇప్పుడు వారితో పోరాడుతున్నట్లు డ్రామాలు చేస్తున్నారని అన్నారు.

ప్రజలను పిచ్చోళ్లనుకుంటారు..!

చంద్రబాబు ప్రజలను పిచ్చోళ్లని అనుకుంటారని, పోలవరం కట్టకముందే జాతికి అంకితం చేసి చప్పట్లు కొట్టమంటారని అన్నారు. ప్రత్యేక హోదాను ఖూనీ చేసిన చంద్రబాబే ఎన్నికలకు ఆరు నెలల ముందు నల్లచొక్కాలు వేసుకొని సినిమా చూపిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లోల ఇచ్చిన హామీ ప్రకారం డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకుండా ఎన్నికలకు మూడు నెలల ముందు పసుపు కుంకుమ అని డ్రామా చేస్తున్నారని అన్నారు. రైతులకు ప్రతీయేటా 12,500 ఇస్తానని తాను చెబితే ఐదేళ్లు రైతులకు ఏమీ చేయని చంద్రబాబు ఎన్నికల ముందు అన్నదాత సుఖీభవ అని డ్రామా చేస్తున్నారని అన్నారు. తాను ప్రకటించినందునే ఎన్నికల ముందు పింఛన్లను పెంచారని, ఆటోలు, ట్రాక్టర్లకు ట్యాక్స్ లు రద్దు చేశారని పేర్కొన్నారు.

Tags:    

Similar News