కేసీఆర్ మద్దతుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

తనకు కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై, యెల్లో మీడియా కథనాలపై వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం [more]

Update: 2019-03-25 09:54 GMT

తనకు కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై, యెల్లో మీడియా కథనాలపై వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం తాడిపత్రిలో జరిగిన ఎన్నికల సభలో జగన్ మాట్లాడుతూ… పండ్లుండే చెట్టు మీదనే రాళ్లు పడ్డట్లుగా వైసీపీ గెలుస్తుందనే భయంతో చంద్రబాబు, వపన్ యెల్లో మీడియా ప్రతీరోజూ తనపై పడి ఏడుస్తున్నారని, తన పేరును కలవరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తనకు వెయ్యి కోట్లు ఇచ్చారని చంద్రబాబు, పవన్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, యెల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. తనకు కేసీఆర్ డబ్బులు ఇస్తుండగా చంద్రబాబు చూశారా లేదా కేసీఆర్ చంద్రబాబుకు ఫోన్ చేసి చెప్పారా అని ప్రశ్నించారు. కనీసం వయస్సుకు కూడా గౌరవం లేకుండా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడటం చంద్రబాబుకే చెల్లుతుందన్నారు.

ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తే తప్పేంటి..?

కేసీఆర్ మద్దతు ఇచ్చేది తనకా, ప్రత్యేక హోదాకా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతు ఇస్తే చంద్రబాబు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. వేరే రాష్ట్రాలు మనకు మద్దతు ఇవ్వడం తప్పా అని అన్నారు. హరికృష్ణ శవం పక్కన పెట్టుకొని టీఆర్ఎస్ పొత్తు కోసం చంద్రబాబు బేరాలు చేయలేదా అని ప్రశ్నించారు. మీతో పొత్తు పెట్టుకుంటే మంచి వారు, పొత్తు పెట్టుకోకపోతే దుర్మార్గులు ఎలా అవుతారని అడిగారు. ఒక రాష్ట్రానికి మరొ రాష్ట్రం మద్దతు ఉంటే రాష్ట్రాల సమస్యలు పరిష్కారమవుతాయనే దిశగా కేసీఆర్ ముందుకువచ్చి ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తే హర్షించాల్సింది పోయి సిగ్గు లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని అన్నారు. మన 25 ఎంపీలకు తెలంగాణలోని 17 మంది ఎంపీలు జతకలిస్తే 42 మంది ఎంపీలు ఒకే తాటిపైకి వచ్చి ప్రత్యేక హోదాకు మద్దతుగా నిలబడితే హర్షించకుండా దిక్కుమాలిన రాజకీయం చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు ఆస్తులు లాక్కున్నారా..?

చంద్రబాబు, ఆయన పార్ట్ నర్ ఐదేళ్లలో కేసీఆర్ ను ఎన్నిసార్లు పొగిడారో గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఓటుకు కోట్లతో దొరికి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన చంద్రబాబు.. మన ప్రజలు తెలంగాణలో ఉన్నారనే కనీస ఆలోచన లేకుండా భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. చంద్రబాబు, ఆయన పార్ట్ నర్ అంటున్నట్లు మన వారిని తెలంగాణలో బెదిరించడం వాస్తవమే అయితే రామోజీరావును, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను బెదిరించారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆస్తులను హైదరాబాద్ లో లాక్కున్నారా అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం భావోద్వేగాలు రెచ్చగొడుతూ తెలంగాణలో ఉన్న మనవారికి చంద్రబాబు, పవన్ అపకారం చేస్తున్నారని అన్నారు. ఐదేళ్లు పాలించి తన పాలన చూసి ఓట్లు అడగలేని అద్వాన్న స్థితిలో చంద్రబాబు ఉన్నారని అన్నారు. తానేం చేశాడో చెప్పుకోలేక, తన పాలనపై ప్రజల దృష్టి మరిల్చేందుకు చంద్రబాబు రోజుకో కథ చెబుతారన్నారు. తన పాలనపై చర్చ జరగవద్దనే రోజుకో కొత్త అంశం తీసుకువచ్చి భావోద్వేగాలతో ప్రజలను రెచ్చగొట్టే దిక్కుమాలిన ఆలోచన చంద్రబాబు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్ కుట్రలను ప్రజలు ఆలోచించాలన్నారు.

Tags:    

Similar News