చంద్రబాబు, పవన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

బాబు వస్తే జాబు వస్తుందని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన కుమారుడికి మాత్రమే ఉద్యోగం ఇచ్చి రాష్ట్రంలో నిరుద్యోగ యువతను మాత్రం పట్టించుకోలేదని వైసీపీ నాయకురాలు [more]

Update: 2019-03-25 06:52 GMT

బాబు వస్తే జాబు వస్తుందని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన కుమారుడికి మాత్రమే ఉద్యోగం ఇచ్చి రాష్ట్రంలో నిరుద్యోగ యువతను మాత్రం పట్టించుకోలేదని వైసీపీ నాయకురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు. వర్ధంతికి జయంతికి తేడా తెలియని, అ ఆ లు కూడా రాని లోకేష్ కు మూడు మంత్రివర్గ శాఖలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సోమవారం ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు పాలనను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. తొమ్మిదేళ్లలో హైదరాబాద్ కట్టానని సెల్ఫ్ డబ్బా కొట్టుకునే చంద్రబాబు ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనం కూడా ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు కేవలం మోసం, వెన్నుపోటు, అవినీతి, స్వార్థ రాజకీయాలు, గోబెల్స్ ప్రచారం, ఆడవారి వ్యక్తిత్వాన్ని కించపర్చడం, హత్యలు చేయించడం, హత్యలు చేసిన వారికి ఆశ్రయం ఇవ్వడంలో మాత్రమే అనుభవం ఉందని ఆరోపించారు. చంద్రబాబును మించిన దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు ఇంకొకరు ఉండరని స్వయంగా ఆయనకు పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారే అన్నారని గుర్తుచేశారు.

ఇది కీలకమైన సమయం

2014లో 600 హామీలిచ్చి కనీసం మొదటి సంతకం చేసిన వాటిని కూడా నెరవేర్చకుండా చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకుండా ఎన్నికల ముందు పసుసు కుంకుమ పేరుతో మరో మోసానికి తెరతీశారన్నారు. 40 ఏళ్లల్లో రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో ఐదేళ్లలో చంద్రబాబు అంత అప్పుచేశారన్నారు. మోడీతో బాబు జోడీ కట్టి రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన ప్రత్యేక హోదాను రాకుండా చేశారన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కావాలన్న చంద్రబాబు మళ్లీ ప్రత్యేక హోదా కావాలన్నారంటే జగన్ చేసిన పోరాటాలు, దీక్షల వల్ల కాదా అని ప్రశ్నించారు. హోదా అంటే జైళ్లో పెడతానని బెదిరించిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. రాష్ట్రంలో భూతద్దం పెట్టి వెతికినా అభవృద్ధి కనిపించడం లేదన్నారు. పేదవారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశ్యంతో వైఎస్ఆర్ తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలను చంద్రబాబు నిర్వీర్యం చేశారన్నారు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని, ప్రజలు చాలా దూరదృష్టితో ఆలోచించాలని కోరారు. ఆంధ్ర రాష్ట్రం దుర్మార్గుల చేతిలో చిక్కి అల్లాడుతోందని, ఇప్పడు మళ్లీ పొరపాటు చేస్తే కోలుకోలేని దెబ్బ తగులుతుందన్నారు. రాష్ట్రం పాతికేళ్లు వెనక్కు వెళుతుందని పేర్కొన్నారు. మంచికి చేడుకు జరిగే పోరాటంలో మంచిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు డైరెక్టన్ లో పనిచేయడమే పవన్ పని

గోబెల్స్ ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట అని షర్మిల ఆరోపించారు. జగన్ అవినీతి చేసి ఉంటే కేసులు పెడతారని తెలిసినా కాంగ్రెస్ నుంచి బయటకు ఎందుకు వస్తారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్ అని, డైరెక్టర్ చెప్పినట్లు చేయడం యాక్టర్ పని అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ సినిమాకు చంద్రబాబు డైరెక్టర్ అని, కాబట్టి చంద్రబాబు చెప్పినట్లు పవన్ చేస్తున్నారని అన్నారు. కోట్లాది మంది ప్రజల డేటా చోరీ చేస్తే పవన్ మాట్లాడలేదని గుర్తు చేశారు. బయటకు విడిగా పోటీ చేస్తున్న అంతర్గతంగా కలిసే ఉన్నారని అన్నారు. తమకు తండ్రి, పెదనాన్న లేరని, ఇంటి పెద్దగా ఉన్న మా చిన్నాన్నను దారుణంగా చంపారన్నారు. పైగా మేమే చేశామంటున్నారని వాపోయారు. బాధితులమైన మమ్మల్నే నిందితులను చేసి మమ్మల్ని డిఫెన్స్ లో పడేసి అసలు నిందితులను తప్పించాలని ప్రయత్నిస్తున్నారు. దమ్ముంటే చంద్రబాబు థర్డ్ పార్టీ విచారణకు చంద్రబాబు అంగీకరించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News