సునీత సంచలన స్టేట్ మెంట్... జగన్ లక్ష్యంగా?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారింది

Update: 2022-02-28 06:15 GMT

ys sunita ys vivekananda reddy murder case

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారింది. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీత తన అన్న జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి హత్య కేసులో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి హస్తం ఉందని తాను జగన్ కు చెప్పానని, అయితే దానిని తేలిగ్గా కొట్టిపారేశారని సునీత తెలిపారు. వారిని అనవసరంగా అనుమానించవద్దని తనకు జగన్ సూచించారన్నారు. సీబీఐతో దర్యాప్తు చేయించాలని తాను కోరగా, దానివల్ల ఏమవుతుంది? అవినాష్ బీజేపీలో చేరతాడని జగన్ అన్నట్లు సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 11 కేసులకు అది తోడవుతుందని జగన్ తేలిగ్గా కొట్టిపారేశారని సునీత తెలిపారు.

తన భర్తే హత్య చేయించాడని...
దాంతో పాటు వాళ్లను అనుమానించవద్దని, బహుశ నీ భర్తే హత్య చేయించి ఉండవచ్చని అని కూడా అనడంతో తన గుండె పగిలినట్లయిందని సునీత ఆరోపించారు. అనుమానితుల జాబితాలో ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో పనిచేసే కాంపౌండర్ పేరు చేరిస్తే అందుకు జగన్ కోప్పడ్డారన్నారు. చిన్నాన్న ప్రాణం కంటే కాంపౌండర్ ఆయనకు ఎక్కువయ్యారని సునీత అన్నారు. వివేకా చనిపోయిన విషయం తెలుసుకుని బాణసంచా కాల్చేందుకు కొనుగోలు చేసిన వ్యక్తిని ఎందుకు వదిలిపెట్టారో తనకు అర్థం కావడం లేదని సునీత వాపోయారు.
న్యాయం దక్కదని భావించి...
ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత తనకు న్యాయం దక్కదని భావించి తాను సీబీఐ చేత విచారణ జరిపించాలని కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని సునీత తెలిపారు. తన తండ్రి వివేకాపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డిలు రాజకీయ కక్ష పెంచుకున్నారన్నారు. హత్య జరిగిన విషయాన్ని తాను తొలుత భారతికి, జగన్ కు ఫోన్ చేసి చెబితే తేలిగ్గా తీసుకున్నారని సునీత ఆరోపించారు. తాను వచ్చే వరకూ తండ్రి మృతదేహానికి పోస్టుమార్టం చేయవద్దని చెప్పినా వినకుండా చేసేశారని సునీత తెలిపారు. హత్య జరిగిన చోట ఆధారాలన్నింటిని చెరిపేశారని సునీత ఆరోపించారు.
సెటిల్‌మెంట్ లో ...
తన తండ్రికి అత్యంత సన్నిహితుడైన ఎంవీ కృష్ణారెడ్డితో కేసు పెట్టించ వద్దని ఎర్రగంగిరెడ్డి చెప్పాడని అనడంతో దీనిని తాను హత్య గా నిర్ధారించుకున్నానని సునీత తెలిపారు. తన తండ్రి హత్యను గత ఎన్నికల్లో జగన్ రాజకీయంగా వాడుకున్నారని ఆమె వాంగ్మూలంలో పేర్కొన్నారు. తాను జగన్ ను, సజ్జల రామకృష్ణారెడ్డి, గౌతమ్ సవాంగ్ లను ఎంత బతిమాలినా ప్రయోజనం లేకపోయిందన్నారు. తన భర్తే ఈ హత్య చేయించాడని అనడంతో జగన్ తో తాను వాగ్వాదానికి దిగానని సునీత తెలిపారు. తన తండ్రి భరత్ యాదవ్, సునీల్ యాదవ్ లతో కలసి బెంగళూరులో 104 కోట్ల వ్యవహారాన్ని సెటిల్ చేశారని, ఇందులో తన తండ్రికి నాలుగు కోట్లు వచ్చాయని చెప్పారు. భరత్ యాదవ్, సునీల్ యాదవ్ తమ వాటా కోరగా, కోటిన్నర కంటే ఎక్కువనని వివేకా చెప్పారని, బహుశ ఈ హత్యకు ఇది కూడా ఒక కారణమయి ఉండవచ్చని సునీత అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆస్తిగా ఉన్న 600 ఎకరాల్లో తనకు, జగన్, షర్మిలకు రెండు వందల ఎకరాల చొప్పున పంచారని, తన వాటాను ఎకరాకు లక్ష ఇచ్చి వాళ్లే తీసుకున్నారని సునీత తెలిపారు. అవినాష్ రెడ్డితో తన భర్త కుమ్మక్కయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.


Tags:    

Similar News