వైఎస్ సునీత vs వైఎస్ అవినాష్ రెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు

Update: 2023-03-10 06:16 GMT

వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అవినాష్ రెడ్డి వేసిన పిటీషన్ లో తనను ఇంప్లీడ్ చేయాలని కోరారు. వైఎస్ అవినాష్ రెడ్డి పిటీషన్ విచారణ సందర్భంగా తన వాదనలను కూడా వినాలని సునీత సుప్రీంకోర్టును పిటీషన్ లో కోరారు. వైఎస్ అవినాష్ రెడ్డి తనకు సీబీఐ 160 సెక్షన్ కింద నోటీసులు జారీ చేసిందని, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలిన నిన్న పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.

పిటీషన్ లో పేర్కొన్న...
అయితే వైఎస్ అవినాష్ రెడ్డి తన పిటీషన్ లో వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు లభ్యమయిన లేఖ మీద సీబీఐ అధికారులు ఎలాంటి విచారణ చేయడం లేదని, ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి చెప్పిన దాని ప్రకారమే సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారని, తన న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలని కోరినా సీబీఐ అధికారులు వినిపించుకోవడం లేదని, అలాగే వీడియో రికార్డింగ్ కూడా చేయడం లేదని ఆయన నిన్న వేసిన రిట్ పిటీషన్ లో హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టులో ఇంప్లీడ్ పిటీషన్...
అయితే సునీత కూడా తన వాదనలను ఈ పిటీషన్‌పై వినిపించడానికి పిటీషన్ వేయడంతో న్యాయస్థానం అంగీకరించే అవకాశమే ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. తొలి నుంచి వైఎస్ సునీత తన తండ్రి హత్య కేసులో అసలు నిందితులు ఎవరో తేల్చాలని పోరాడుతున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించేలా తీర్పు వచ్చేలా చేయగలిగారు. ఆ తర్వాత ఏపీలో కాకుండా ఇతర రాష్ట్రాల న్యాయస్థానానికి ఈ కేసు విచారణను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు తలుపుతట్టారు. అన్నింటా వైఎస్ సునీత విజయం సాధించగలిగారు.
విచారణకు హాజరైన...
మరోవైపు వైఎస్ అవినాష్ రెడ్డి ఈరోజు సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన హాజరవుతారా? లేదా? అన్న అనుమానాలను పటా పంచలు చేస్తూ ఆయన భారీగా అనుచరులతో కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డిని మూడోసారి సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెబుతున్నారు.


Tags:    

Similar News